Let's talk: editor@tmv.in
‘గ్రీన్‌ల్యాండ్‌’ అమెరికా చేతుల్లో ఉండాల్సిందే: ట్రంప్‌

‘గ్రీన్‌ల్యాండ్‌’ అమెరికా చేతుల్లో ఉండాల్సిందే: ట్రంప్‌

Shaik Mohammad Shaffee
15 జనవరి, 2026

ప్రపంచ పటంలో వ్యూహాత్మకమైన గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని దక్కించుకోవాలనే పట్టుదలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రదర్శించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా నియంత్రణలోకి రాకపోవడాన్ని 'ఆమోదయోగ్యం కానిది'గా ఆయన బుధవారం అభివర్ణించారు. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా ఈ ద్వీపం తమకు అత్యవసరమని, దీనిని అమెరికాకు అప్పగించేలా 'నాటో' ముందుండి సహకరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రష్యా, చైనా అక్కడ ఆధిపత్యం చెలాయిస్తాయని, అది తాము జరగనివ్వమని ట్రంప్ హెచ్చరించారు.

వ్యూహాత్మక ప్రయోజనాలే లక్ష్యం

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా ఇంతగా ఆశపడటానికి ప్రధానంగా భౌగోళిక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా.. అమెరికా నిర్మిస్తున్న 'గోల్డెన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థకు గ్రీన్‌ల్యాండ్ అత్యంత కీలకం. వాతావరణ మార్పుల వల్ల మంచు కరుగుతుండటంతో, ఇక్కడ దాగి ఉన్న కంప్యూటర్లు, ఫోన్ల తయారీకి అవసరమైన కీలక ఖనిజాలను వెలికితీయడం సులభతరం అవుతుంది. అలాగే ఆసియాకు తక్కువ దూరంలో కొత్త సముద్ర వాణిజ్య మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నాటోలో సంక్షోభ ఛాయలు

డెన్మార్క్ రాజ్యంలో గ్రీన్‌ల్యాండ్ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన భూభాగం. డెన్మార్క్ నాటోలో సభ్యదేశం అయినప్పటికీ, ఒక మిత్రదేశంపైనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాటో కూటమి ఐక్యతకే సవాల్‌గా మారింది. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు గ్రీన్‌ల్యాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకునే అవకాశాన్ని పూర్తిగా ఖండించకపోవడం ఐరోపా దేశాల్లో కలవరం రేపుతోంది. అమెరికా చర్యలు నాటో అంతానికే దారితీస్తాయని డెన్మార్క్ ప్రధాని ఇప్పటికే హెచ్చరించారు.

రంగంలోకి దిగిన జేడీ వాన్స్‌

ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వాషింగ్టన్‌లో కీలక చర్చలు నిర్వహించనున్నారు. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రాస్ముసెన్, గ్రీన్‌ల్యాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్ట్‌లతో వాన్స్ జరిపే భేటీపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. ఈ సమావేశంలో అమెరికా తన పట్టును ఎలా ప్రదర్శిస్తుంది లేదా దౌత్యపరంగా వెనక్కి తగ్గుతుందా అన్నది చర్చనీయాంశమైంది.

గ్రీన్‌ల్యాండ్ ప్రజల నిరసన గళం

ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్‌ల్యాండ్ రాజధాని 'నూక్' ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 ఏళ్ల విద్యార్థిని టూటా మికాయెల్సెన్ మాట్లాడుతూ.. "అమెరికా అధికారులు వెంటనే వెనక్కి తగ్గాలి. గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదు" అని స్పష్టం చేశారు. స్థానిక వీధుల్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సందడి చేస్తున్నా, స్థానికులు మాత్రం తాము డెన్మార్క్ భాగస్వామ్యంలోనే సంతోషంగా ఉన్నామని, అమెరికా పెత్తనాన్ని సహించబోమని తేల్చిచెబుతున్నారు.

గ్రీన్‌ల్యాండ్ ప్రధాని కౌంటర్

గ్రీన్‌ల్యాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ కోపెన్‌హాగన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. "ఒకవేళ మాకు అమెరికా-డెన్మార్క్ మధ్య ఎంచుకోవాల్సి వస్తే, మేము కచ్చితంగా డెన్మార్క్, నాటో, యూరోపియన్ యూనియన్ వైపే నిలుస్తాం" అని స్పష్టం చేశారు. అయితే దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "ఆయనెవరో నాకు తెలియదు, కానీ ఆయన వ్యాఖ్యలు ఆయనకే పెద్ద సమస్యగా మారతాయి" అంటూ హెచ్చరికలు గుప్పించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

స్థానికుల వాదన

రష్యా, చైనా నౌకలు గ్రీన్‌ల్యాండ్ తీరాన్ని చుట్టుముట్టాయని ట్రంప్ చేస్తున్న వాదనలను స్థానికులు తోసిపుచ్చుతున్నారు. లార్స్ వింట్నర్ అనే ఇంజనీర్ మాట్లాడుతూ.. "నేను ఇక్కడే నివసిస్తున్నాను, సముద్రంలో ఎప్పుడూ రష్యా, చైనా నౌకలను చూడలేదు. ట్రంప్ చెప్పేవన్నీ కేవలం ఆక్రమణ కోసం సృష్టించుకున్న ఊహగానాలే" అని మండిపడ్డారు. మరో స్థానికుడు హన్స్ నోర్గార్డ్ ఏకంగా ట్రంప్ బెదిరింపు ధోరణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

డెన్మార్క్‌తోనే భద్రత.. అమెరికాతో భయం

డెన్మార్క్ భాగస్వామ్యంలో గ్రీన్‌ల్యాండ్ ప్రజలకు ఉచిత వైద్యం, ఉన్నత విద్య, ఆర్థిక సాయం అందుతున్నాయి. అమెరికా నియంత్రణలోకి వెళ్తే ఈ సామాజిక భద్రతా పథకాలన్నీ కనుమరుగైపోతాయేమోనని మికాయెల్సెన్ వంటి యువత ఆందోళన చెందుతున్నారు. అమెరికా కేవలం సహజ వనరుల కోసమే గ్రీన్‌ల్యాండ్‌ను ఆశిస్తోందని, ప్రజల సంక్షేమం వారికి పట్టదని వారు ఆరోపిస్తున్నారు.

దౌత్య వ్యూహాలు, చట్టపరమైన అడ్డంకులు

అమెరికా కాంగ్రెస్‌లో కూడా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాటో మిత్రదేశాల భూభాగాన్ని వారి అనుమతి లేకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ నిధులను వినియోగించకూడదనే చట్టప్రతిపాదనను ఇద్దరు సెనేటర్లు ప్రవేశపెట్టారు. ఇది ట్రంప్ అనాలోచిత నిర్ణయాలకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా తెచ్చిన బిల్లుగా భావిస్తున్నారు.

ఐరోపా సంఘీభావం.. ఫ్రాన్స్ చొరవ

డెన్మార్క్ సార్వభౌమాధికారానికి ఐరోపా దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. గ్రీన్‌ల్యాండ్ ప్రజలదేనని, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు డెన్మార్క్‌కే ఉంటుందని ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు స్పష్టం చేశాయి. ఫ్రాన్స్ ఒక అడుగు ముందుకు వేసి, ఫిబ్రవరి 6న గ్రీన్‌ల్యాండ్‌లో తమ కాన్సులేట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. "నాటో మిత్రదేశంపై దాడి చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం" అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఘాటుగా స్పందించారు.