Let's talk: editor@tmv.in
గ్రీన్‌లాండ్‌ వ్యవహారంతో మాకు సంబంధం లేదు: పుతిన్

గ్రీన్‌లాండ్‌ వ్యవహారంతో మాకు సంబంధం లేదు: పుతిన్

Shaik Mohammad Shaffee
23 జనవరి, 2026

డెన్మార్క్ దేశం ఆధీనంలో ఉన్న గ్రీన్‌‌లాండ్ దీవిని ఎలాగైనా విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా స్పందిస్తూ.. ' గ్రీన్‌‌లాండ్ ఎవరి దగ్గర ఉంటే మాకేంటి? అది మాకు అనవసరమైన విషయం' అని తేల్చి చెప్పారు. ఇది పూర్తిగా అమెరికా, డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న సమస్య అని, తాము ఇందులో అస్సలు తలదూర్చబోమని ఆయన స్పష్టం చేశారు.

గ్రీన్‌‌లాండ్ విలువ 1 బిలియన్ డాలర్లు!

గ్రీన్‌‌లాండ్ విలువ ఎంత ఉండొచ్చన్న దానిపై పుతిన్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. 1867లో రష్యా తన అలాస్కా ప్రాంతాన్ని 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు విక్రయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆనాటి ధరను ప్రస్తుత ద్రవ్యోల్బణం, బంగారు ధరలతో పోల్చి చూస్తే.. గ్రీన్‌‌లాండ్ విలువ సుమారు 1 బిలియన్ డాలర్లు ఉండవచ్చని పుతిన్ అంచనా వేశారు. అంతటి భారీ మొత్తాన్ని అమెరికా సులభంగానే చెల్లించగలదని ఆయన చమత్కరించారు.

డెన్మార్క్ తీరుపై విమర్శలు

గ్రీన్‌‌లాండ్ పట్ల డెన్మార్క్ అనుసరిస్తున్న తీరును పుతిన్ తప్పుబట్టారు. డెన్మార్క్ ఎప్పుడూ గ్రీన్‌‌లాండ్‌ను ఒక వలస ప్రాంతంగానే పరిగణించిందని, అక్కడ స్థానికుల పట్ల కఠినంగా, క్రూరంగా వ్యవహరించిందని విమర్శించారు. 1917లో డెన్మార్క్ తన ఆధీనంలోని వర్జిన్ దీవులను అమెరికాకు విక్రయించిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. గతంలో ఇలాంటి భూభాగాలు అమ్ముకున్న చరిత్ర ఉన్నందున, ఇప్పుడు కూడా వారు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

తగ్గిన ట్రంప్ దూకుడు..

మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొన్న ట్రంప్, గ్రీన్‌‌లాండ్ విషయంలో తన పంథాను కొంత మార్చుకున్నారు. గ్రీన్‌‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగించబోమని, అలాగే ఐరోపా దేశాలపై టారిఫ్ ఆంక్షలు విధిస్తానన్న బెదిరింపులను కూడా తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని, ఒక ఒప్పందానికి వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యా వ్యూహాత్మక మౌనం

గ్రీన్‌‌లాండ్‌ పై రష్యాకు కూడా కన్ను ఉందన్న వార్తలను రష్యా విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా, ఐరోపా దేశాల మధ్య విబేధాలను పెంచుతుండటంతో రష్యా దీనిని నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ అమెరికా అక్కడ తన ఉనికిని పెంచుకుంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో సత్సంబంధాలను కొనసాగించడానికే పుతిన్ ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపిస్తోంది.