Let's talk: editor@tmv.in
గ్రీన్‌లాండ్‌ కోసం.. ఐరోపాపై ట్రంప్‌ ‘సుంకాల’ యుద్ధం

గ్రీన్‌లాండ్‌ కోసం.. ఐరోపాపై ట్రంప్‌ ‘సుంకాల’ యుద్ధం

Shaik Mohammad Shaffee
19 జనవరి, 2026

గ్రీన్‌లాండ్‌ భూభాగంపై అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య వివాదం మరింత పెరిగింది. ఈ వ్యూహాత్మక భూభాగాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 'సుంకాల యుద్ధం' ప్రకటించారు. డెన్మార్క్‌తో పాటు దానికి మద్దతుగా నిలిచిన మరో ఏడు దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ఆయన శనివారం సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ టారిఫ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్ నుంచి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు.

ఏయే దేశాలపై ప్రభావం?

డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై ఈ 10 శాతం అదనపు సుంకం వర్తిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్ విషయంలో ఈ దేశాలన్నీ డెన్మార్క్‌కు మద్దతుగా నిలవడమే ఈ చర్యకు కారణమని తెలిపారు.

జూన్ 1 డెడ్‌లైన్

గ్రీన్‌లాండ్‌ను అమెరికా “పూర్తిగా, సంపూర్ణంగా కొనుగోలు” చేయడానికి జూన్ 1 నాటికి ఒప్పందం కుదరకపోతే, ఈ సుంకాన్ని 25 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో చేసినవేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒత్తిడి పెంచడమే ట్రంప్ వ్యూహం

డెన్మార్క్‌తో పాటు ఇతర ఐరోపా దేశాలను చర్చల టేబుల్ వద్దకు రప్పించేందుకే టారిఫ్‌లను ఆయుధంగా ఉపయోగిస్తున్నట్టు ట్రంప్ మాటల్లో స్పష్టమవుతోంది. గ్రీన్‌లాండ్ అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతమని, అక్కడి భౌగోళిక స్థానం వ్యూహాత్మకంగా ముఖ్యమని ట్రంప్ పదేపదే చెబుతున్నారు.

చర్చలకు సిద్ధం.. ట్రంప్ సంకేతం

‘‘అమెరికా కోసం ఇంతటి రిస్క్ తీసుకున్న దేశాలతో, డెన్మార్క్‌తో వెంటనే చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అంటే సుంకాలు విధించడం ద్వారా ఒప్పందానికి బలవంతంగా నడిపించే వ్యూహమేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాటో కూటమికి గట్టి పరీక్ష

1949 నుంచి కొనసాగుతున్న నాటో కూటమిలో అమెరికా–ఐరోపా సంబంధాలకు ఇది పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ట్రంప్ మిత్రదేశాలు, ప్రత్యర్థులపై వాణిజ్య ఆంక్షలు విధిస్తూ తన మాట నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల పెట్టుబడుల హామీలు రాగా, చైనా వంటి దేశాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

దావోస్‌ సదస్సులో ముఖాముఖి భేటీ?

ఈ పరిణామాల నడుమ ట్రంప్ మంగళవారం స్విట్జర్లాండ్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడే ఆయన సుంకాల బెదిరింపులకు గురైన ఐరోపా దేశాల నేతలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంది. ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

ఈయూ దేశాల స్పందన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐరోపా దేశాధినేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వారమే వాషింగ్టన్‌లో అమెరికా ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు సానుకూలంగా ముగిశాయని, ఆ వెంటనే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్‌ముస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ నేతలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఈ సుంకాలు అమెరికా-ఐరోపా మధ్య ఉన్న మైత్రిని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం దీనిని తప్పుబడుతూ.. గ్రీన్‌లాండ్ భవిష్యత్తును అక్కడి ప్రజలు, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించాలని, ఈ అంశంపై నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా ఘాటుగా స్పందిస్తూ.. ఉక్రెయిన్ విషయంలోనైనా, గ్రీన్‌లాండ్ విషయంలోనైనా సరే, తాము ఎటువంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అమెరికాకు తేల్చి చెప్పారు.

నిరసనలతో అట్టుడుకుతున్న గ్రీన్‌లాండ్

ట్రంప్ బెదిరింపులకు వ్యతిరేకంగా ఐరోపా అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రీన్‌లాండ్ రాజధాని 'నూక్'లో గడ్డకట్టే చలిని, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వందలాది మంది ప్రజలు తమ స్వయంపాలనకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో వేలాది మంది గ్రీన్‌లాండ్ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. "ప్రపంచంలో చిన్న దేశాలు ఉండవచ్చు, కానీ అవేవీ అమ్మకానికి సిద్ధంగా లేవు" అని నిరసనకారులు తేల్చి చెప్పారు.

చట్టపరమైన సందేహాలు

అయితే ఐరోపా దేశాలన్నీ కలిసి ఒకే ఆర్థిక మండలిగా ఉన్నప్పుడు, ట్రంప్ కేవలం కొన్ని దేశాలపైనే పన్నులు ఎలా విధిస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇది అమెరికా చట్టాల ప్రకారం సాధ్యమేనా అనే అంశంపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని దౌత్యవేత్తలు భావిస్తున్నారు.

గ్రీన్‌లాండ్ ప్రాధాన్యం

ఖనిజ సంపదకు నిలయమైన గ్రీన్‌లాండ్, భౌగోళికంగా ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. కేవలం 57 వేల జనాభా మాత్రమే ఉన్న ఈ దీవి రక్షణ బాధ్యతలను ప్రస్తుతం డెన్మార్క్ దేశం చూస్తోంది. అయితే 1951లో జరిగిన రక్షణ ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇక్కడ సైనిక కార్యకలాపాలు నిర్వహించే అధికారం ముందు నుంచే ఉంది. ఒకప్పుడు వేలాది మంది అమెరికన్ సైనికులు ఇక్కడ ఉండేవారు, కానీ ప్రస్తుతం వాయువ్య గ్రీన్‌లాండ్‌లోని 'పిటుఫిక్ స్పేస్ బేస్‌'లో కేవలం 200 మంది మాత్రమే ఉన్నారని డెన్మార్క్ స్పష్టం చేసింది. ఈ సైనిక కేంద్రం క్షిపణి దాడులను ముందే గుర్తించడంతో పాటు, అంతరిక్ష నిఘా, రక్షణ వ్యవహారాల్లో అమెరికాకు, నాటో కూటమికి అత్యంత కీలకంగా పనిచేస్తోంది.