
గ్రీన్‌లాండ్‌పై మళ్లీ ట్రంప్ కన్ను.. నాటో దేశాలకు వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఆయన తన దృష్టిని మళ్లీ గ్రీన్‌లాండ్‌వైపు మళ్లించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో తనకు అండగా నిలవని నాటో సభ్య దేశాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, గ్రీన్‌లాండ్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు.
నాటో కూటమికి ఘాటు హెచ్చరికలు
"మాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు సాయం చేయలేదు, ఇకముందు కూడా చేయవు. ఆ గ్రీన్‌లాండ్ సంగతి గుర్తుంచుకోండి.. అదొక పెద్ద మంచు ముక్క మాత్రమే. ప్రస్తుతం దాన్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు" అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. పరోక్షంగా గ్రీన్‌లాండ్ భూభాగాన్ని దక్కించుకోవాలనే తన పాత కోరికను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి బయటపెట్టారు. మిత్రదేశాలు సహాయం చేయకపోతే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలను ఆయన పంపారు.
సహాయం చేయని దేశాల జాబితా ఇదే..
బుధవారం వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మరింత ఘాటుగా స్పందించారు. "ఇరాన్‌తో యుద్ధం జరుగుతుంటే జపాన్ మాకు సాయం చేయలేదు, ఆస్ట్రేలియా ముందుకు రాలేదు, దక్షిణ కొరియా కూడా పట్టించుకోలేదు. ఇక నాటో విషయానికి వస్తే వారు అసలే సాయం చేయలేదు" అని విమర్శించారు. ఉత్తర కొరియా నుంచి రక్షణ కల్పించేందుకు జపాన్‌లో 50,000 మంది, దక్షిణ కొరియాలో 45,000 మంది అమెరికా సైనికులను మోహరించామని, అయినప్పటికీ ఆ దేశాలు అమెరికా ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు.
గ్రీన్‌లాండ్ అమెరికాకు ఎందుకు ముఖ్యం?
రష్యా, చైనాల నుండి ఎదురయ్యే ముప్పును అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్ ఒక రక్షణ కవచంలా అమెరికాకు ఉపయోగపడుతుంది. అక్కడ ఉండే అపారమైన ఖనిజ సంపద కూడా అమెరికాకు చాలా అవసరం. అందుకే ఆ ప్రాంతాన్ని కొనేస్తానని గతంలో ట్రంప్ ప్రతిపాదించారు. అయితే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలు దీనిని అస్సలు ఒప్పుకోలేదు. "మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం, మా స్వేచ్ఛను గౌరవించండి" అని వారు అమెరికాకు తేల్చి చెప్పారు.
పాత గొడవ మళ్లీ తెరపైకి
గతంలో ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో బెదిరింపులకు దిగినప్పుడు ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా దేశాలన్నీ ఏకమై ఆయనను అడ్డుకున్నాయి. అప్పట్లో అక్కడి ఖనిజ వనరులను వాడుకునేలా ఒక ఒప్పందం కుదరడంతో ట్రంప్ శాంతించారు. కానీ ఇప్పుడు నాటో దేశాలు తనకు యుద్ధంలో సాయం చేయడం లేదని ఆయన గుర్రుగా ఉన్నారు. ఆ కోపంతోనే పాత గ్రీన్‌లాండ్ వివాదాన్ని ట్రంప్ మళ్లీ తెరపైకి తెచ్చారు.
