Let's talk: editor@tmv.in
గ్రీన్లాండ్‌పై అమెరికా నియంత్రణకు మద్దతు ఇవ్వకుంటే ఇతర దేశాలపై టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

గ్రీన్లాండ్‌పై అమెరికా నియంత్రణకు మద్దతు ఇవ్వకుంటే ఇతర దేశాలపై టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

Dantu Vijaya Lakshmi Prasanna
18 జనవరి, 2026

గ్రీన్లాండ్‌పై అమెరికా నియంత్రణను సమర్థించని దేశాలపై శిక్షాత్మక టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు. డెన్మార్క్ రాజధానిలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ నుండి ఈ ప్రకటన రావడం గమనార్హం.

డెన్మార్క్ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన గ్రీన్లాండ్ భూభాగాన్ని అమెరికా తన ఆధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ గత కొన్ని నెలలుగా పట్టుబడుతున్నారు. ఈ ఆర్కిటిక్ ద్వీపం అమెరికా చేతుల్లో లేకపోవడం "అంగీకారయోగ్యం కాదు" అని ఆయన ఈ వారంలోనే పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, గతంలో మందుల దిగుమతులపై యూరప్ మిత్రదేశాలను టారిఫ్‌లతో హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, "గ్రీన్లాండ్ విషయంలో కూడా నేను అలాగే చేయవచ్చు. మా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అవసరం, కాబట్టి దీనికి అంగీకరించని దేశాలపై సుంకాలు విధిస్తాను" అని ఆయన అన్నారు.

దౌత్యపరమైన విభేదాలు చర్చలు

ఈ వారంలోనే డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ చర్చలు విభేదాలను పరిష్కరించలేకపోయినప్పటికీ, ఒక 'వర్కింగ్ గ్రూప్'ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. అయితే, ఈ గ్రూప్ ఉద్దేశంపై డెన్మార్క్, అమెరికా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, అమెరికా సెనేటర్లు, ప్రతినిధుల బృందం కోపెన్ హాగన్‌లో డెన్మార్క్ ప్రధాని మెట్ టె ఫ్రెడరిక్సన్, గ్రీన్లాండ్ నాయకులతో సమావేశమైంది. ఈ సందర్భంగా డెమోక్రాట్ సెనేటర్ క్రిస్ కూన్స్ మాట్లాడుతూ, 225 ఏళ్లుగా డెన్మార్క్ తమకు నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. రిపబ్లికన్ సెనేటర్ లిసా ముర్కోవ్స్కీ మాట్లాడుతూ, "గ్రీన్లాండ్‌ను ఒక ఆస్తిలా కాకుండా ఒక మిత్రదేశంగా చూడాలి" అని అభిప్రాయపడ్డారు.

అసలు వివాదం ఏమిటి?

చైనా, రష్యాలు గ్రీన్లాండ్‌పై కన్నేశాయని, అక్కడ అపారమైన ఖనిజ సంపద ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. అవసరమైతే బలప్రయోగం ద్వారా గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామనే విషయాన్ని వైట్ హౌస్ తోసిపుచ్చలేదు.

అయితే, గ్రీన్లాండ్ రాజకీయ నాయకురాలు ఆజా చెమ్నిట్జ్ స్పందిస్తూ, "అమెరికా చెబుతున్నవన్నీ అబద్ధాలు, అతిశయోక్తులు. ప్రస్తుతం మాకు అసలైన ముప్పు అమెరికా నుండే కనిపిస్తోంది" అని మండిపడ్డారు.

ఇడి ఇలా ఉంటే 75% మంది అమెరికన్లు గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నట్లు సెనేటర్ ముర్కోవ్స్కీ తెలిపారు. నాటో సభ్య దేశాల సమ్మతి లేకుండా గ్రీన్లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రక్షణ శాఖ నిధులను వాడకూడదని అమెరికా సెనేటర్లు ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

"మేము అమెరికా, డెన్మార్క్ మధ్య ఎంచుకోవాల్సి వస్తే, డెన్మార్క్, నాటో వైపే ఉంటాము" అని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ స్పష్టం చేశారు. అమెరికా ధోరణి స్వదేశీ ఇన్యుట్ ప్రజలను తక్కువ చేసి చూపేలా ఉందని, తాము మళ్లీ వలస పాలనలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఇన్యుట్ సర్కంపౌలర్ కౌన్సిల్ చైర్ సారా ఓల్స్విగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రీన్లాండ్‌పై అమెరికా నియంత్రణకు మద్దతు ఇవ్వకుంటే ఇతర దేశాలపై టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక - Tholi Paluku