
గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో 46 విడుదల
గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల అమలు విధానంపై మరింత స్పష్టతనిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చట్టం–2018లోని సెక్షన్ 9, 17 ప్రకారం సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలను జారీ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కేటాయించడానికి ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించనుంది. వార్డు సభ్యుల స్థానాల విషయంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తాజా కులగణన ఆధారంగా కల్పిస్తున్నారు. అలాగే, బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కూడా ఈ కులగణన ఆధారంగానే ఇస్తారు. ఎస్సీ,ఎస్టీ జనాభాకు 2011 జనాభా లెక్కలు, బీసీ జనాభాకు ఎస్‌ఈఈపీసీ సర్వే 2024 ప్రకారం కల్పించనున్నారు.
సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు (ఆర్డీవోలు ) ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఖరారు చేయనున్నారు.ఈ నూతన మార్గదర్శకాలు రాబోయే పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, సామాజిక న్యాయం పాటించడానికి దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది.
గతంలో రిజర్వ్ చేసిన వార్డులను తొలగించిన తర్వాత మిగిలిన వార్డులు సరిపోకపోతే, అవి నేరుగా మహిళలకు కేటాయించాలి. మిగతా రిజర్వేషన్లు లాటరీ పద్ధతిలో నిర్ణయిస్తారు. 2019లో రిజర్వేషన్లు చేసినా ఎన్నికలు జరగని గ్రామాల్లో, ఆ రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయి.అదే సమయంలో సెక్షన్ 9(ఎ) వివరణ ప్రకారం, ఎస్టీ, ఎస్సీ జనాభా తగినంతగా లేని సందర్భంలో, మొదట జనాభా ఎక్కువగా ఉన్న వార్డుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తారు. మిగతా రిజర్వేషన్లు లాటరీ విధానంతో కేటాయిస్తారు.మహిళలకు వార్డుల రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తారు.
