
గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే సురేంద్ర బాబు
గ్రామస్తులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంతో ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని కామక్కపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన తొలుత స్థానిక ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పునర్నిర్మాణంలో ఉన్న శివాలయం పనులను టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.
గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన శివాలయ పనులను విశ్వనాథ్ చొరవ తీసుకుని తిరిగి ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఆలయ గోపురం నిర్మాణానికి తన వంతు సహకారంగా రూ. 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఊరిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి కష్టాలను తీర్చేందుకు రాబోయే నెలన్నర రోజుల్లోనే అత్యాధుని క వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పొలాలకు వెళ్లే దారులు, భూ సమస్యలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు త్వరలోనే అధికారుల బృందం గ్రామంలో పర్యటిస్తుందని అర్హులైన పేదలకు త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని వెల్లడించారు.
గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపుపై స్పందిస్తూ వచ్చే ఏడాది ఎంపీ నిధుల ద్వారా మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని కాగా ఇప్పటికే సుమారు రూ. 60 లక్షల ఎంపీ నిధులతో వడ్డెర్ల కళ్యాణ మండపం, కంబదూరు ఎస్సీ కాలనీ భవనాలకు ప్రతిపాదనలు పంపామని వివరించారు. నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే తన దృష్టికి తీసుకురావాలని మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు . ఈ క్రమంలోనే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కామక్కపల్లికి చెందిన అంజినమ్మకు రూ. 25 వేల నగదును తక్షణ ఆర్థిక సాయంగా అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
