
గ్రామీణ భారతంలో శ్రేయస్సు పెంపు - నాబార్డ్ సర్వే
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన పునరుద్ధరణ కనిపిస్తోందని, 80 శాతం గ్రామీణ గృహాలు గత సంవత్సరంలో స్థిరంగా అధిక వినియోగాన్ని నివేదించాయని నాబార్డ్ (రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే) ఒక తాజా నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న శ్రేయస్సు, మెరుగైన కొనుగోలు శక్తికి ఈ ఫలితాలు స్పష్టమైన నిదర్శనమని నాబార్డ్ పేర్కొంది.
నాబార్డ్ ఆర్ఇసిఎస్ఎస్ ఎనిమిదవ రౌండ్ గ్రామీణ డిమాండ్‌లో విస్తృత పునరుద్ధరణ, పెరుగుతున్న ఆదాయాలు గత సంవత్సరంలో మెరుగుపడిన గృహ సంక్షేమానికి స్పష్టమైన సాక్ష్యాన్నిఅందిస్తుంది. భారత్ లో గ్రామీణ వినియోగ డిమాండ్‌లో బలమైన పునరుద్ధరణ కనిపిస్తుందని సర్వే తెలిపింది. వినియోగం పెరగడానికి ప్రధాన కారణం నిజమైన కొనుగోలు శక్తి పెరగడమేనని సర్వే పేర్కొంది.
నెలవారీ ఆదాయంలో 67.3శాతం ఇప్పుడు గ్రామీణ ప్రజలు వినియోగంపై ఖర్చు చేస్తున్నారు, ఇది సర్వే ప్రారంభం నుండి అత్యధిక వాటా. దీనికి జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ సహాయపడింది. ఇది వినియోగంపై అధిక వ్యయం అనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. 42.2 శాతం గ్రామీణ గృహాలు ఆదాయ వృద్ధిని సాధించాయి. ఇది అన్ని సర్వే రౌండ్‌లలో అత్యుత్తమ పనితీరు కనబరిచింది. నివేదికలో కేవలం 15.7 శాతం మా త్రమే ఆదాయ క్షీణతను నివేదించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్పం.
75.9 శాతం మంది వచ్చే ఏడాది ఆదాయాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 2024 నుండి గ్రామీణ ప్రాంత ప్రజల్లో భవిష్యత్తుపై అత్యధిక ఆశావాదం కనిపిస్తుంది అని నివేదిక వెల్లడించింది. 29.3 శాతం గృహాలు గత సంవత్సరంలో మూలధన పెట్టుబడిని పెంచాయి. ఇది మునుపటి నివేదికల కంటే ఎక్కువ. ఈ పెట్టుబడి వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలో కొత్త ఆస్తి సృష్టిని చూపుతుంది.
58.3 శాతం గ్రామీణ గృహాలు కేవలం అధికారిక రుణ వనరులను మాత్రమే పొందాయి. ఇది అన్ని రౌండ్‌లలో అత్యధికం. అయితే, అనధికారిక రుణాల వాటా ఇంకా దాదాపు 20 శాతంగా ఉంది. అలాగే సగటు నెలవారీ ఆదాయంలో పది శాతం సంక్షేమ బదిలీల ద్వారా (సబ్సిడీ ఆహారం, విద్యుత్, నీరు, వంట గ్యాస్ మొదలైనవి) సమర్థవంతంగా భర్తీ అవుతోంది.
సగటు ద్రవ్యోల్బణం అవగాహన 3.77 శాతానికి తగ్గింది, ఇది సర్వే ప్రారంభం నుండి మొదటిసారి 4 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇది నిజమైన ఆదాయాన్ని, కొనుగోలు శక్తిని పెంచింది. గ్రామీణ గృహాలు రోడ్లు, విద్య, విద్యుత్, తాగునీరు ఆరోగ్య సేవల్లో మెరుగుదల పట్ల అధిక సంతృప్తిని వ్యక్తం చేశాయి.
ఈ సర్వే ప్రతి రెండు నెలలకు ఒకసారి భారతదేశం అంతటా నిర్వహించబడుతుంది. ఇది ఆదాయం, వినియోగం, ద్రవ్యోల్బణం, క్రెడిట్, పెట్టుబడి, అంచనాలకు సంబంధించిన పరిమాణాత్మక సూచికలు, గృహాల అభిప్రాయాలను తెలుపుతుంది.
