
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్న అన్న క్యాంటీన్లు
రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్న క్యాంటీన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు కొనసాగుతుండగా తాజాగా మరో 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది. దీంతో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి పెరగనుంది.
పేదలు, కార్మికులు, కూలీలు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5కే భోజనాన్ని అందిస్తోంది. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న హామీ మేరకు ప్రభుత్వం రెండో విడత విస్తరణను చేపట్టింది.
మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 204 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 3 క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. తాజా విస్తరణతో గ్రామీణ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.
ప్రస్తుతం పనిచేస్తున్న 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు సుమారు 2.10 లక్షల మంది భోజనం చేస్తున్నారు. ఒక్కో క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,013 మంది భోజనం చేస్తుండగా నిర్వహణకు సగటున రూ.26,250 వ్యయం అవుతోంది. మొత్తం క్యాంటీన్ల ద్వారా రోజుకు రూ.54 లక్షలకుపైగా ఖర్చు అవుతుండగా ఇప్పటివరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రూ.243 కోట్లు వెచ్చించింది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామీణ అన్న క్యాంటీన్లకు ఏడాదికి అదనంగా సుమారు రూ.58 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యాంటీన్ల పునఃప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పేదలు సుమారు 8.80 కోట్ల భోజనాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 15న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో రెండో విడత గ్రామీణ అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 1 గంటకు ధరణికోట చేరుకుంటారు. 1.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం 2.45 గంటలకు తిరిగి ఉండవల్లికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.
