
గ్రామీణ పోషకాహార రంగంలో సేవలకు విద్యా పరుశురాంకర్‌కు రోహిణి నయ్యర్ అవార్డు
గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార ప్రోత్సాహానికి నూతన మార్గాలను ఆవిష్కరిస్తున్న పుణెకు చెందిన విద్యా పరుశురాంకర్ (24) ప్రతిష్టాత్మక నాలుగో రోహిణి నయ్యర్ అవార్డును అందుకున్నారు. గురువారం నాడు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్ రూ. 10 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రం, ట్రోఫీ ఆమెకు అందజేశారు
రోహిణి నయ్యర్ ఫౌండేషన్ అందించే ఈ వార్షిక పురస్కారం, ప్రజా విధానాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో విశేష సేవలు అందిస్తున్న యువతను సత్కరించేందుకు ఏర్పాటు చేసింది. ఈ అవార్డు దక్కిన వారిలో విద్యా మొదటి మహిళ మాత్రమే కాక అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం.
వ్యక్తిగత స్ఫూర్తి… సామాజిక సేవగా మార్గం
రైతు కుటుంబంలో జన్మించిన విద్యా చిన్నప్పుడు రక్తహీనతతో బాధపడిన అనుభవం ఆమెను పోషకాహారంపై పరిశోధన చేయడానికి ప్రేరేపించింది. ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఫుడ్ టెక్నాలజీ విభాగంలో ఎం.టెక్ పూర్తి చేసిన ఆమె, అగ్రోజీ ఆర్గానిక్స్ పేరుతో వ్యవసాయ–పోషకాహార రంగంలో కొత్త ప్రయోగాలు చేపట్టింది.
“మిల్లెట్స్ నౌ” అనే పథకం ద్వారా పోషక ధాన్యాలతో తయారుచేసిన బయో-ఫోర్టిఫైడ్ రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలను తయారుచేసి రక్తహీనత, పోషకాహార లోపాల నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
మొదట 300 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ ప్రయత్నం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మందికి చేరింది. ఫౌండేషన్ అందించిన సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా 7,000 మంది చిన్న రైతులు లబ్ధి పొందుతున్నారు.కాగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారు పండించిన ధాన్యాన్ని తిరిగి కొనుగోలు చేయడం ద్వారా రైతు సుస్థిరాభివృద్ధికి తోడ్పడుతున్నారు.
మహిళలకూ ఉపాధి అవకాశాలు
ఈ ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో ఆంగన్‌వాడీ సిబ్బంది, మహిళా స్వయం సహాయ సంఘాలు కూడా భాగస్వామ్యమవుతున్నారు. దీంతో గ్రామీణ మహిళలకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయని విద్యా వివరించారు. అదేవిదంగా భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును దక్షిణాసియా దేశాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు.
మహిళలకు ప్రేరణ
ఉద్యమ పంథాలో అడుగుపెట్టే యువతకు ధైర్యం అవసరం అని
విద్యా పేర్కొన్నారు.“కుటుంబం, సమాజం అనుకున్న విధంగా నడవడం మహిళలకు సవాల్.అయినా, సమాజానికి సేవ చేయాలన్న దృఢసంకల్పం వారిని ముందుకు నడిపిస్తుంది.ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం,” అని ఆమె చెప్పారు.
పురస్కారం నేపథ్యం
సమాజ, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న 40 ఏళ్లలోపు యువ మార్పు సందేశకులకు ఈ గౌరవం అందజేస్తున్నారు. గతంలో ఈ పురస్కారం పొందినవారు
• సెత్రీచెమ్ సంగ్తామ్ (నాగాలాండ్, 2022)
• దిననాథ్ రాజ్‌పుత్ (ఛత్తీస్‌గఢ్, 2023)
• అనిల్ ప్రధాన్ (ఒడిశా, 2024)
ఫౌండేషన్ డైరెక్టర్ దీపక్ నయ్యర్ మాట్లాడుతూ, యువతలో మార్పు స్ఫూర్తి రగిలించడం, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వారిని ఆదరించడం రోహిణి నయ్యర్ ఆశయమని చెప్పారు.
