
గ్రామీణ జీవన సౌందర్యం ఏమయింది?
భారత ఆత్మ గ్రామాల్లోనే ఉందన్నారు మహాత్మాగాంధీ. దేశ అసలు శక్తి గ్రామాల్లోనే ఉందని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టని ఆర్థిక నిపుణులు కూడా చెబుతుంటారు. 1951లో తొలి జనగణన జరిగినప్పుడు మొత్తం జనాభాలో 82.7శాతం గ్రామాల్లో ఉండేవారు. మిగిలిన 17.3శాతం పట్టణాల్లో ఉండేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 68.84శాతం గ్రామాల్లో ఉంటే పట్టణజనాభా ప్రజలు 31.16శాతానికి పెరిగారు. ప్రపంచ బ్యాంక్ సమాచారం ప్రకారం భారత్‌లో 2023నాటికి 63.64శాతం గ్రామాల్లో ఉంటే 36.36శాతం ప్రజలు పట్టణాల్లో జీవిస్తున్నారు. అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి పట్టణ జనాభా పెరిగిపోతోంటే, గ్రామాల జనాభా తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణం గ్రామాలనుంచి వలసలు ఎక్కువగా ఉండడం. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక, అభివృద్ధి లేక, వ్యవసాయం గిట్టుబాటు కాక పెద్దసంఖ్యలో ప్రజలు ఈ ఏడున్నరదశాబ్దాల కాలంలో వలసబాట పట్టారు. అదే సమయంలో చదువులు పెరగడం, ఉద్యోగాలు నగరాలు, పట్టణాలకు ఎక్కువగా పరిమితమవడం కూడా వలసలకు కారణం. పెరుగుతున్న జనాభా పట్టణాలు, నగరాలపై ఒత్తిడి పెంచుతోంటే...ఖాళీ అవుతున్న గ్రామాలు దశాబ్దాలుగా అభివృద్ధి ఊసే లేకుండా మిగిలిపోతున్నాయి. పట్టణాలు, నగరాల్లో పెద్దసంఖ్యలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. అధిక జనాభా ఒత్తిడితో ప్రజల కనీస అవసరాలు తీరడం లేదు. పట్టణంలో ఎలాగోలా బతకొచ్చని వలసబాట పట్టినా సరైన ఉపాధిలేక పస్తులతో గడపాల్సిన పరిస్థితి నిరుపేదలకు ఎదురవుతోంది.
ఈ పరిస్థితి మారాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగాలి. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, మంచినీళ్లు, పోషకాహారం వంటివి ప్రజలకు అందాలి. అయితే ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టడం లేదు. జనాభా ఎక్కువగా ఉందన్న కారణాలతో పట్టణాలు, నగరాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. అయినప్పటికీ జనాభాకు తగ్గట్టుగా ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఉండడం లేదు. దీనికి బదులుగా గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రజలను విద్యావంతులను చేసి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్వయం సహాయక గ్రూపులను ప్రోత్సహించి జీవనోపాధికి భరోసా కల్పిస్తే ఉన్న ఊరును విడిచిపెట్టి వెళ్లుందకు ప్రజలు మొగ్గుచూపరు. ఉద్యోగాలతో ఉపాధి పెరిగిన తర్వాత గ్రామాల్లో నివసించేవారిపై మన సమాజంలో ఓ అపోహ ఏర్పడింది. చదువు సరిగ్గా లేక, సరైన ఉద్యోగం లేక నగరాల్లో నివసించేవీలులేని వారే గ్రామాల్లో ఉంటున్నారన్న భావన నెలకొంది. సాఫ్ట్ వేర్ విప్లవం తర్వాత ప్రజలు అమెరికా వంటి దేశాలకు వలస పోవడం మామూలైపోయింది. ఇది కూడా గ్రామీణ జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. చదువుమీద ఆసక్తి లేకనో, గ్రామాల్లో నివసించడాన్ని ఇష్టపడో, వ్యవసాయరంగం మీద మక్కువతోనో ఎవరన్నా గ్రామాల్లో ఉంటే వారిని చులకనగా చూసే భావన పెరిగింది. అసలు గ్రామాల్లో నివసించే యువతీయువకులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారిన సామాజిక వాతావరణం నెలకొంది. ఇవన్నీ తొలగిపోవాలంటే ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేట్ వ్యాపార సంస్థలు గ్రామాలకు, ఓ మోస్తరు పట్టణాలకు దగ్గరగా తమ కార్యకలాపాలను నిర్వహించుకునే ప్రయత్నాలు చేసే స్థానిక యువతకు కొత్తఉద్యోగాలు లభిస్తాయి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే యువత గ్రామాల్లో స్థిరపడడానికి మొగ్గుచూపుతుంది. ఓ తరంలో వలసలను కొంతమేర నివారించగలిగితే..తర్వాత స్థిరత్వం వస్తుంది. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో సమతుల్యత సాధించడం సాధ్యపడుతుంది. పట్టణాలు, నగరాల జనాభా పెరగడాన్ని అభివృద్ధికి కొలమానంగా కొందరు భావిస్తారు. కానీ ఆర్థికనిపుణుల అంచనా ప్రకారం గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయంటే గ్రామీణరంగం సంక్షోభంలో కూరుకుపోతున్నట్టు. ఇది అంతిమంగా దేశాభివృద్ధిపై తీవ్రప్రభావం చూపుతుంది.
గ్రామాల్లోని ప్రజలు ఎక్కువమంది వలసల బాట పట్టడంవల్ల దశాబ్దాలుగా పట్టణాలు, నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగి అనేక విపరిణామాలకు దారితీస్తోంది. కాలుష్యం పెరిగిపోతోంది. వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. గాలీ,వెలుతురూ సరిగ్గా ఉండే ఇల్లు పట్టణాలు, నగరాల్లో కనిపించడం లేదు. అధిక జనాభా, వాహనాల వినియోగం, పరిశ్రమల వ్యర్థాలు, ఆహార వ్యర్థాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. పట్టణాలు, నగరాలు కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. అయినాసరే ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టిపెట్టడం లేదు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. స్థానికంగా ఉపాధి కల్పించే మార్గాలు వెతకడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేసి, గ్రామీణప్రజల ఓట్లు రాబట్టుకోవడమే రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉంటోంది తప్ప నిజంగా ప్రజల జీవితాలను బాగు చేసే ఉద్దేశం కనిపించడం లేదు.
సంక్షేమపథకాల కోసం ఖర్చుపెడుతున్న మొత్తంలో నాలుగోవంతును గ్రామాల అభివృద్ధి కోసం, ఉపాధి పెంపు కోసం ఖర్చు పెట్టినా ఊళ్ల స్వరూపం మారిపోతుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే వ్యవసాయపనులు పెరుగుతాయి. , గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అటు రైతులకు, ఇటు నిరుపేదలకూ మేలు కలుగుతుంది. చెరువులు, కాలువలు పరిశుభ్రంగా ఉంచడం, సాగునీటి సౌకర్యాలు పెంచడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలిగితే...చిన్నాచితక ఉద్యోగాలతో పట్టణాలు, నగరాల్లో తిప్పలు పడుతున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టే వీలుంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయరంగానికి ఆధునికత జోడించి అద్భుత ఫలితాలు రాబట్టాలని భావించే యవత ఎంతో మంది మన మధ్యలో కనిపిస్తుంటారు. కానీ సరైన ప్రోత్సాహం లేక వాళ్లు తమ ఉద్యోగాల్లోనే ఇష్టంలేకపోయినా ముందుకు సాగుతుంటారు. నిజానికి పట్టణాలు, నగరాల మీద ఎక్కువమంది వ్యామోహం పెంచుకుంటారు గానీ గ్రామాలతో పోలిస్తే అక్కడ నివసించడం వల్ల కాలుష్యం, స్వచ్ఛమైన గాలి, మంచినీళ్లు, మంచి ఆహారం వంటివి లభించడక మనిషి సగటు ఆయుర్దాయం తగ్గుతోంది. గ్రామస్వరాజ్యమే దేశాభివృద్ధికి నిదర్శనమన్నది వట్టి మాటలు కాదు. పల్లెలు పచ్చగా కళకళలాడుతుంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నది కాదనలేని నిజం
