Let's talk: editor@tmv.in
గ్రామీణ ఉపాధి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

గ్రామీణ ఉపాధి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

Pinjari Chand
22 డిసెంబర్, 2025

గ్రామీణ ఉపాధి విధానంలో కీలక మలుపుగా నిలిచే వికసిత భారత్– గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోదం తెలిపారు. దీంతో గ్రామీణ భారతంలో ఉపాధి హక్కును మరింత బలపరిచే కొత్త చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 125 రోజుల వేతన ఉపాధి హామీని చట్టబద్ధంగా కల్పించనున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), 2005ను ఈ కొత్త చట్టం భర్తీ చేస్తుంది. ఇది ‘వికసిత భారత్ @2047’ దృక్పథానికి అనుగుణంగా రూపొందించారు.

ఉపాధి హామీ పెంపు – జీవన భద్రతకు బలం

కొత్త చట్టం ప్రకారం, స్వచ్ఛందంగా అన్‌స్కిల్డ్ మాన్యువల్ పని చేయడానికి ముందుకొచ్చే గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సంవత్సరానికి కనీసం 125 రోజుల ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది (సెక్షన్ 5(1)). ఇది గతంలోని 100 రోజుల హామీతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా, గ్రామీణ కుటుంబాలకు ఆదాయ స్థిరత్వాన్ని మరింత బలపరుస్తుంది.

వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ‘పాజ్ పీరియడ్’

పంట విత్తే, కోత కాలాల్లో వ్యవసాయ కూలీల లభ్యతను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రాలకు సంవత్సరానికి గరిష్ఠంగా 60 రోజుల సమిష్టి విరామ కాలాన్ని ప్రకటించే అధికారం ఇచ్చారు. అయితే మొత్తం 125 రోజుల ఉపాధి హామీకి ఇది భంగం కలిగించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వేతన చెల్లింపులో కఠిన నిబంధనలు

పని పూర్తయిన తర్వాత వారానికి ఒకసారి లేదా గరిష్ఠంగా 15 రోజుల్లో వేతనం చెల్లించాలి. ఆలస్యమైతే షెడ్యూల్–II ప్రకారం డిలే కంపెన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూలీల వేతన భద్రతను బలోపేతం చేస్తుంది.

ఉపాధితో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి

ఈ చట్టం కింద చేపట్టే పనులు నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తాయి:

• నీటి భద్రత, నీటితో సంబంధిత పనులు

• ప్రధాన గ్రామీణ మౌలిక వసతులు

• జీవనోపాధి ఆధారిత మౌలిక వసతులు

• సృష్టించే అన్ని ఆస్తులను వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లో నమోదు చేసి, ప్రభుత్వ పెట్టుబడుల సమన్వయం, పునరావృత వ్యయం నివారణ, ఫలితాల ఆధారిత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గ్రామ సభకే ప్రాధాన్యం

అన్ని పనులు వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు (వీజీపీపీస్) ద్వారా రూపొందిస్తారు. ఇవి గ్రామసభ ఆమోదంతోనే అమలవుతాయి. ఈ ప్రణాళికలను పీఎం గతి శక్తి వంటి జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానం చేస్తారు. అయినా, స్థానిక స్థాయి నిర్ణయాధికారాన్ని తగ్గించబోమని చట్టం స్పష్టం చేస్తోంది.

ఖర్చుల భారం – కేంద్రం, రాష్ట్రాల మధ్య వాటా

ఈ పథకం కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలవుతుంది.

• సాధారణ రాష్ట్రాలకు: 60:40

• ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు: 90:10

• శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు: 100శాతం కేంద్రం భారం

• పరిపాలనా వ్యయ పరిమితిని 6శాతం నుంచి 9శాతానికి పెంచారు, తద్వారా సిబ్బంది, శిక్షణ, సాంకేతిక సామర్థ్యం మెరుగుపడనుంది.

హక్కులు తగ్గలేదని కేంద్రం స్పష్టం

ఈ చట్టం ద్వారా ఉపాధి హక్కు తగ్గలేదని, మరింత బలపడిందని ప్రభుత్వం పేర్కొంది. 15 రోజుల్లో పని ఇవ్వకపోతే ఉద్యోగ రాహిత్య భృతి చెల్లించాల్సిన నిబంధనను మళ్లీ బలంగా అమలు చేయనున్నారు. నిధుల కేటాయింపులు నార్మేటివ్ విధానంలో ఉన్నప్పటికీ, ఉపాధి హక్కు చట్టబద్ధంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సాంకేతికత – అడ్డంకి కాదు, సహాయక సాధనం

బయోమెట్రిక్ ధృవీకరణ, జియో-ట్యాగింగ్, రియల్ టైమ్ డాష్‌బోర్డులు వంటి సాంకేతికతను పారదర్శకత కోసం వినియోగిస్తామని, అదే సమయంలో గ్రామసభల ద్వారా సామాజిక ఆడిట్ కు (సోషల్ ఆడిట్) పూర్తి ప్రాధాన్యం ఉంటుందని చట్టం చెబుతోంది.

గ్రామీణ భారత్ దిశగా కీలక అడుగు

‘వికసిత భారత్– జీ రామ్ (గ్రామీణ) చట్టం, 2025’ గ్రామీణ ఉపాధిని కేవలం సంక్షేమ పథకంగా కాకుండా, సమగ్ర అభివృద్ధికి వ్యూహాత్మక సాధనంగా మలిచే ప్రయత్నంగా కేంద్రం అభివర్ణించింది. ఇది ఆదాయ భద్రత, శాశ్వత ఆస్తులు, వాతావరణానికి తట్టుకునే అభివృద్ధితో గ్రామీణ భారతాన్ని మరింత బలమైన దిశగా నడిపిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

గ్రామీణ ఉపాధి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం - Tholi Paluku