
గ్రామీణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేసి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చరిత్రను, విలువలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ అభివృద్ధి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, విలువలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి కార్యకర్త ఈ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు.
అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో వలిగొండ నుంచి కాటేపల్లి వరకు రూ.49.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ రహదారి ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరిగి, ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి అన్నారు.
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన రహదారులు, సమగ్ర అభివృద్ధి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
