Let's talk: editor@tmv.in
గ్రామస్థాయి విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘కరెంటోళ్ల జనబాట’

గ్రామస్థాయి విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘కరెంటోళ్ల జనబాట’

Panthagani Anusha
24 డిసెంబర్, 2025

విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు గ్రామ స్థాయిలో విద్యుత్ భద్రతను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త అడుగు వేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తిరుపతి జిల్లా మోగరాల గ్రామంలో ‘కరెంటోళ్ల జనబాట’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్) పరిధిలో అమలు కానుందని అధికారులు తెలిపారు.

మంత్రి గవీ రవికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ లైన్లను సమగ్రంగా తనిఖీ చేసి, లోపాలను సకాలంలో సరిచేయడంతో పాటు విద్యుత్ ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామలలో విద్యుత్ మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించడంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులను ప్రత్యక్షంగా స్వీకరించి తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విద్యుత్ లైన్ల తనిఖీ, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మార్పు, ట్రాన్స్‌ఫార్మర్ల భద్రత కోసం రక్షణ కంచెలు ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లను భూమి నుంచి ఎతైన కాంక్రీట్ పీఠాలపై ఏర్పాటు చేయడం ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించడం వంటి చర్యల ద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ప్రోత్సాహానికి కృషి చేయడంతో పాటు, విద్యుత్ బిల్లులు, వినియోగం, సేవలకు సంబంధించిన అంశాలపై ప్రజలతో ప్రత్యక్షంగా చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంచడంతో పాటు, సేవా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యమని మంత్రి వివరించారు.

రైతులు, గృహ వినియోగదారులు, పరిశ్రమలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఉపకేంద్రాల నిర్మాణానికి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గవీ రవికుమార్ తెలిపారు. ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువై వారి అవసరాలను నేరుగా తెలుసుకునే వేదికగా మారుతుందని మంత్రి వెల్లడించారు.