
గ్రామల పునర్నిర్మాణమే లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమం బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.
ముందుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి పనిచేయాలని సూచించారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పరస్పర సహకారంతో పనిచేస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మహిళా సర్పంచ్‌ల విషయంలో ప్రత్యేకంగా స్పందించిన ఎమ్మెల్యే, వారి స్థానంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా మహిళా సర్పంచ్‌లే ముందుండి విధులు నిర్వహించాలని సూచించారు. సర్పంచ్‌ల విధి నిర్వహణలో వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించాలని, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పాలన సాగాలని అన్నారు.గత ప్రభుత్వ పాలనలో జుక్కల్ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన ఎమ్మెల్యే ఇప్పుడు అందరం కలిసికట్టుగా నియోజకవర్గ పునర్నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రతి సర్పంచ్‌కు తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్నదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. అలాగే ప్రతి అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే తన ఆశయమని తెలిపారు. సర్పంచ్‌లు హుందాగా వ్యవహరించి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రజల మన్ననలు పొందేలా పనిచేసి చిరస్థాయిగా గ్రామ ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం తప్పక లభిస్తుందని, భవిష్యత్తులో వారికి మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు.
జుక్కల్ చరిత్రలో తొలిసారిగా 164 స్థానాల్లో 127 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఫలితాలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించాయని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా అందించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, వివిధ మండలాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్‌లు, పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
