Let's talk: editor@tmv.in
గ్రామపంచాయతీ ఎన్నికల ముందు సూర్యాపేటలో ఘర్షణ: బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి

గ్రామపంచాయతీ ఎన్నికల ముందు సూర్యాపేటలో ఘర్షణ: బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి

Gaddamidi Naveen
11 డిసెంబర్, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక బీఆర్‌ఎస్ కార్యకర్త మరణించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు గంటల ముందే చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సంఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొనగా, పోలీసులు అదనపు దళాలను మోహరించారు.

పోలీసుల వివరాల ప్రకారం,మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రెండు రాజకీయ గుంపుల మధ్య మాటామంతీ చోటుచేసుకుంది. అది క్రమంగా ఘర్షణగా మారి కర్రలు, రాళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనలో 57 ఏళ్ల బీఆర్‌ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడి తలపై గాయం అయ్యింది. మొదట సూర్యాపేట ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు మార్చారు. అయితే బుధవారం ఉదయం ఆసుపత్రికి చేరుకునే సరికి ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

మృతుని కోడలు ఈ ఎన్నికల్లో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బంధువుపై కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.ఇక గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి శాంతిగా ఉన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బలగాలను నియమించారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి.

కాంగ్రెస్ హత్యా రాజకీయాలు సహించేది లేదు: కేటీఆర్

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలను ప్రజాస్వామ్యంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ “హత్యా రాజకీయాలకు” దిగజారిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ గూండాల దాడులను బీఆర్‌ఎస్ ఏ విధంగానూ సహించదు. మృతుడి కుటుంబానికి పూర్తి మద్దతు కల్పిస్తాము, అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బాధ్యత వహించాల్సిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అలాగే ఈ ఘటనలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మరణించటం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. మంగళవారం రాత్రి లింగంపల్లిలో సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు అని. ఈ దాడిలో ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలగా, మరో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు అని తెలిపారు. మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌లతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించామ‌ని. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఎవరు భయపడవద్దు, ధైర్యంగా నిలబడాలని ఆయన భరోసా ఇచ్చారు.

గ్రామపంచాయతీ ఎన్నికల ముందు సూర్యాపేటలో ఘర్షణ: బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి - Tholi Paluku