Let's talk: editor@tmv.in
గ్రాండ్‌స్లామ్‌లో జోకోవిచ్ సరికొత్త రికార్డు

గ్రాండ్‌స్లామ్‌లో జోకోవిచ్ సరికొత్త రికార్డు

Pinjari Chand
25 జనవరి, 2026

టెన్నిస్ చరిత్రలో తనకే తానే కొత్త రికార్డులు నెలకొల్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు నోవాక్ జోకోవిచ్. 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన జోకోవిచ్, గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో 400 మ్యాచ్‌లు గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్స్‌చుల్ప్పై 6-3, 6-4, 7-6 (4)తో జోకోవిచ్ విజయం సాధించాడు. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్‌లలో అతని మొత్తం విజయాలు 400కు చేరాయి. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జోకోవిచ్‌కు ఇది 102వ మ్యాచ్ విజయం. దీంతో ఈ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా రోజర్ ఫెడరర్ (102 విజయాలు) రికార్డును సమం చేశాడు. జోకోవిచ్ ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను పది సార్లు గెలుచుకున్నాడు. ఇది కూడా ఓ సరికొత్త రికార్డే. 38 ఏళ్ల వయసులో జోకోవిచ్ ఇప్పుడు తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియాలో బరిలోకి దిగాడు. ఆ ఘనత సాధిస్తే, టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా నిలుస్తాడు.

ఈ మ్యాచ్‌లో జోకోవిచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చూపించాడు. మూడో సెట్‌లో కొన్ని క్షణాలు మాత్రమే అతనికి ఇబ్బంది ఎదురైంది. మూడో గేమ్‌లో జారి కిందపడినప్పటికీ, పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత 12వ గేమ్‌లో ప్రత్యర్థికి రెండు సెట్ పాయింట్లు వచ్చినా, జోకోవిచ్ చాకచక్యంగా వాటిని కాపాడుకున్నాడు. మూడో గేమ్ అనంతరం జోకోవిచ్ వైద్య విరామం తీసుకున్నాడు. అనంతరం అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ షాట్‌తో మ్యాచ్‌పై తిరిగి పట్టు సాధించాడు.

టైబ్రేక్ సమయంలో ప్రేక్షకులు ‘నోలే… నోలే… నోలే’ అంటూ జోకోవిచ్‌కు మద్దతుగా నినదించారు. చివరికి టైబ్రేక్‌ను గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పడిపోయినప్పుడు నేను నన్ను నేనే కాపాడుకోగలిగాను. పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారి ఉండేదని మ్యాచ్ అనంతరం జోకోవిచ్ వ్యాఖ్యానించాడు. టోర్నీ ఆరంభం నాకు బాగా కలిసొచ్చింది. గత ఏడాది నేను తొందరగా ఉత్సాహానికి లోనయ్యాను, దాని వల్ల గాయాల పాలయ్యాను. ఈసారి మాత్రం జాగ్రత్తగా ముందుకెళ్తున్నాను అని చెప్పాడు.

యువ ఆటగాళ్లు జానిక్ సిన్నర్, కార్లోస్ ఆల్కరాజ్ ప్రస్తుతం అత్యుత్తమ స్థాయిలో ఆడుతున్నారని అంగీకరిస్తూనే, నేను ఇంకా ఈ యువకులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని జోకోవిచ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక తొలి రౌండ్‌లో విజయం ద్వారా జోకోవిచ్ ఇప్పటికే రెండు చారిత్రక రికార్డులను సమం చేశాడు.

21వ ఆస్ట్రేలియన్ ఓపెన్

81వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ

మెల్‌బోర్న్ పార్క్‌లో ఇది అతనికి 100వ విజయం కావడం మరో విశేషం. దీంతో గ్రాండ్‌స్లామ్‌లలో మూడు వేర్వేరు కోర్టుల్లో (హార్డ్, గ్రాస్, క్లే) చెరో 100కుపైగా మ్యాచ్‌లు గెలిచిన తొలి పురుష ఆటగాడిగా కూడా జోకోవిచ్ నిలిచాడు.