
గ్రంథాలయాలే సమాజ అభివృద్ధికి దిక్సూచి: ఉపరాష్ట్రపతి
‘గ్రంథాలయాలు కేవలం పుస్తక భాండాగారాలు కావు. అవి ఆలోచనలకు ఆలయాలు, సమాజాన్ని చైతన్యపరచే కేంద్రాలు’ అని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. కేరళలోని తిరువనంతపురం కనకక్కున్ను ప్యాలెస్‌లో పీ.ఎన్. పణిక్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ‘లైబ్రరీస్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్– గ్లోబల్ పర్ స్పక్టివ్స్’కు ఆయన ఆదివారం వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సదస్సు నవంబర్ 2 నుంచి 3 వరకు జరగనుంది. ఇందులో దేశీ, విదేశీ నిపుణులు, విధానకర్తలు, గ్రంథాలయాధికారులు, డిజిటల్ ఇన్నోవేటర్లు పాల్గొంటున్నారు. గ్రంథాలయాల ఆధునిక పాత్ర, సమాజంలో వాటి ప్రాధాన్యత, డిజిటల్ యాక్సెస్ వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ పుస్తక ప్రేమికుల మనసులు హత్తుకున్నారు. భారతదేశ గ్రంథాలయోద్యమానికి పితామహుడైన పీ.ఎన్. పణిక్కర్ దర్శనమే నేటి పఠన సంస్కృతికి పునాది అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఆయన ఫౌండేషన్ ‘వయిచు వళరుక’ (చదివి ఎదగండి) అనే నినాదం ఇప్పటికీ సమాజానికి దిక్సూచి లాంటిదని ప్రశంసించారు.
సాధువుల జ్ఞానమే మన నాగరికత
రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఆది శంకరాచార్యుల నుంచి అనేక మంది ఋషులు, తాత్వికులు భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జ్వలింపజేశారు. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలనుంచి ఆధునిక గ్రంథాలయాల దాకా మన దేశం విద్యా సంపదలో సమృద్ధిగా ఉంది అని వివరించారు.
డిజిటల్ యుగంలో గ్రంథాలయాల పాత్ర
నేటి డిజిటల్ యుగంలో సమాచారం సులభంగా అందుబాటులో ఉన్నా, దాని నిజానిజాలను అర్థం చేసుకునే లోతైన ఆలోచనకు గ్రంథాలయాలే మార్గం చూపుతాయి. అవి సమాజంలో సంభాషణ, చింతన, విమర్శనాత్మక దృష్టికోణాన్ని పెంపొందిస్తాయ అని ఉపరాష్ట్రపతి వివరించారు. కేరళలో పఠన సంస్కృతిని ప్రజా చలనంగా మార్చిన పీ.ఎన్. పణిక్కర్ సేవలకు ఆయన ఘన నివాళులు అర్పించారు. గ్రంథాలయాలు ప్రజలకు పుస్తకాలు మాత్రమే కాదు, చైతన్యాన్ని, చర్చను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. సమాజ శక్తి జ్ఞానంలో ఉంది. ప్రజా గ్రంథాలయాలు, కమ్యూనిటీ లైబ్రరీల నెట్వర్క్‌ను బలోపేతం చేయడం అవసరం అని ఆయన పిలుపునిచ్చారు.
