
గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకూడదు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ వినియోగ గ్యాస్ లభ్యతపై ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు, అపోహలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉండవల్లిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఎక్కడా దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా గృహ వినియోగ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. సామాన్యుడికి గ్యాస్ అందడంలో జాప్యం జరగకూడదు. పంపిణీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 17 వేల టన్నుల నిల్వలు
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,209 టన్నుల ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలకు చెందిన 1,154 గ్యాస్ ఏజెన్సీల ద్వారా పంపిణీ నిరంతరాయంగా సాగుతోందని వెల్లడించారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత వినియోగదారులు వేచి చూసే సమయాన్ని గణనీయంగా తగ్గించాలని సీఎం అధికారులను కోరారు.
మరోవైపు ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాల వంటి అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలు రోజువారీ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇంధన అవసరాలను తట్టుకోవడానికి ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్లు, ఇండక్షన్ స్టౌవ్‌ల వినియోగాన్ని ప్రజల్లో ప్రోత్సహించాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఏపీ సహా పొరుగు రాష్ట్రాలకు అదనపు గ్యాస్ నిల్వలను కేటాయించే అవకాశం ఉందని అధికారులు ఈసందర్బంగా ముఖ్యమంత్రికి వివరించారు.
