Let's talk: editor@tmv.in
గ్యాస్‌ సంక్షోభం..మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్‌ సంక్షోభం..మూతపడుతున్న హోటళ్లు

Pinjari Chand
11 మార్చి, 2026

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు… పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం భారత్‌లోని రెస్టారెంట్ రంగంపై తీవ్రంగా పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ కొరతతో 24 గంటలు కిటకిటలాడే రెస్టారెంట్లు బలవంతంగా ‘రెస్ట్’లోకి జారుకుంటున్నాయి. సందడిగా ఉండే హోటళ్లు డల్‌గా మారుతుండగా, వాటిపై ఆధారపడి జీవనం సాగించే ఉద్యోగులు సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ ఎల్పీజీ సరఫరా తగ్గిపోవడంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ యుద్ధం కారణంగా దెబ్బతినడంతో భారతదేశానికి వచ్చే ఎల్పీజీ దిగుమతులు కూడా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గింది. రెస్టారెంట్ యజమానుల ప్రకారం ఈ పరిస్థితి కొనసాగితే అనేక హోటళ్లు మూతపడే ప్రమాదం ఉంది. ఉద్యోగాలు కోల్పోయే అవకాశంతో పాటు బయట భోజనం మీద ఆధారపడే ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడవచ్చని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్యాస్ కొరతను తీర్చాలని కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖలు రాశారు.

మెనూల తగ్గింపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు మెనూలను తగ్గిస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ పరికరాలతో తయారు చేయగలిగే వంటకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కత్తా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

తమిళనాడులోని అనేక హోటళ్లు ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిల్వలు మరో ఒకటి లేదా రెండు రోజులకే సరిపోతాయని చెబుతున్నాయి. ఒక ప్రముఖ రెస్టారెంట్ అధికారి మాట్లాడుతూ ఇది మాకు రెండో కరోనా లాక్‌డౌన్‌లా అనిపిస్తోంది. దోసె, టీ, కాఫీ వంటి వంటకాలకు నిరంతరం గ్యాస్ అవసరం. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే సరిపోతాయి. తర్వాత సరఫరా లేకపోతే కార్యకలాపాలు నిలిపివేయాల్సిందే అని అన్నారు. చెన్నైలోని మరో హోటల్ ఇప్పటికే ఫ్రైడ్ రైస్, సైడ్ డిష్‌లు, అప్పం వంటి గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే వంటకాలను తయారు చేయడం నిలిపివేసింది.

ముంబైలో 20శాతం హోటళ్లు మూత

ముంబైలోని ఇండియన్‌ హోటల్ అండ్ రెస్టారెంట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం కమర్షియల్ ఎల్పీజీ కొరత కారణంగా ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి ఛగన్‌భుజ్‌భల్‌ కూడా త్వరలో కమర్షియల్ ఎల్పీజీ సరఫరా మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు.

కోల్‌కత్తాలో పరిస్థితి తీవ్రం

కోల్‌కత్తాలో దాదాపు 5,000 రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలో చాలా గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయని నేషనల్ రెస్టారెంట్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్థానిక చాప్టర్ ప్రతినిధి పీయూష్‌ కంకరియా తెలిపారు. సుమారు 40 శాతం రెస్టారెంట్లు వెంటనే ప్రభావితమయ్యే పరిస్థితి ఉందని, మరో 30–40 శాతం రెస్టారెంట్లు కొద్ది రోజులే కొనసాగగలవని చెప్పారు.

ప్రత్యామ్నాయాలపై దృష్టి

ఢిల్లీలోని కొన్ని రెస్టారెంట్లు విద్యుత్ పరికరాలను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘రాస్తా’ రెస్టారెంట్ చైన్ సహ వ్యవస్థాపకుడు జాయ్‌ సింగ్‌ మాట్లాడుతూ గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు మెనూలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. అయితే అన్ని వంటకాలు విద్యుత్ పరికరాలతో తయారు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. దాల్ మఖ్ని, రాజ్మా, బిర్యానీ, నిహారి, ఖోర్మా వంటి వంటకాలు గంటల తరబడి మంటపై నెమ్మదిగా ఉడికించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఆందోళన

బెంగళూరులో హోటల్ యజమానులు కూడా పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు కొన్ని వంటకాలను ఇప్పటికే మెనూలో నుంచి తొలగించామని వారు తెలిపారు. లక్నో, పుదుచ్చేరి, భువనేశ్వర్, కోల్‌కత్తా వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లక్నోలోని ఒక గ్యాస్ ఏజెన్సీ యజమాని ప్రకారం ఇప్పటికే కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఒడిశాలోని హోటల్‌ అండ్‌ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఒడిస్సా పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి చేసుకోవాలని కోరింది. పరిస్థితి అలాగే కొనసాగితే పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు సుమారు 50,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఎల్పీజీ దిగుమతులపై యుద్ధ ప్రభావం

భారతదేశం సంవత్సరానికి సుమారు 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగిస్తుంది. ఇందులో 87 శాతం గృహ వినియోగానికి, మిగతా భాగం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి కమర్షియల్ రంగానికి వినియోగిస్తున్నారు. మొత్తం అవసరాల్లో దాదాపు 62 శాతం ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడుతోంది. ప్రస్తుతం అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిస్పందన కారణంగా హర్ముజ్ జలసంధి సముద్ర మార్గం ప్రభావితమైంది. ఈ మార్గం ద్వారా భారత్‌కు వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో 85–90 శాతం రవాణా జరుగుతుంది. ఈ పరిస్థితి కొనసాగితే దేశంలోని రెస్టారెంట్ రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండడంతో స్విగ్గీ, జోమాటో లాంటి ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌పామ్స్‌ కూడా ఆర్డర్లు లేక​ అక్కడ పనిచేసే గిగ్‌వర్కర్లు నిరాశ చెందుతున్నారు.