Let's talk: editor@tmv.in
గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు: అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు: అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్

Gaddamidi Naveen
12 మార్చి, 2026

వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందనే సాకుతో సైబర్ నేరగాళ్లు సామాన్యులను దోచుకుంటున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు.

గ్యాస్ సిలిండర్ల కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తక్షణమే డెలివరీ చేస్తాం, అదనపు సిలిండర్లు ఇస్తాం అంటూ సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ, ముందుగా డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఇలాంటి సందేశాలు వస్తే అవి ఖచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలని సీపీ స్పష్టం చేశారు.

సిలిండర్ బుకింగ్ లేదా చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలి. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.ఆకర్షణీయమైన ఆఫర్ల ఆశతో బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, లేదా యూపీఐ పిన్ వంటివి ఎవరికీ పంచుకోకూడదు.

బాధితులు ఏం చేయాలి?

ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. సకాలంలో స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు: అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్ - Tholi Paluku