
గ్యాస్ కొరత వేళ..కేంద్రమంత్రులతో ప్రధాని సమావేశం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం కీలక మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సంక్షోభ ప్రభావం భారత వినియోగదారులపై పడకుండా చూడాలని, అందుకు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆయన మంత్రులకు సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. దేశంలోని ఇంధన పరిస్థితి, దిగుమతులు, సరఫరా పరిస్థితులపై వారు చర్చించారు.
అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ స్పందించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనితో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. అలాగే భారత్‌కు వచ్చే గ్యాస్ సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ రోజుకు సుమారు 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుంది. ఇందులో దాదాపు సగం దిగుమతుల ద్వారానే వస్తుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ట్యాంకర్ల రాకపోకలు ప్రభావితమవడంతో మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చే సుమారు 60 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడింది, ఇది మొత్తం సరఫరాలో దాదాపు 30 శాతం వరకు ప్రభావం చూపిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీలో ప్రాధాన్యత క్రమాన్ని మార్చింది. గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ ఉత్పత్తి, సిఎన్‌జీ, పైప్ గ్యాస్ (పీఎన్‌జీ) సరఫరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో భారత్ ఇతర దేశాల నుంచి కూడా ఇంధన దిగుమతులను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా, రష్యా, వెనిజువేలా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఇంధన వనరులను సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
