
గ్యాస్ కొరతపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన గ్యాస్ కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ వేదికగా ఆందోళనకు దిగింది. మంగళవారం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం అక్కడ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, మరోవైపు హోటళ్లు, చిన్న వ్యాపారులకు గ్యాస్ సరఫరా నిలిపివేయడం వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజలతో పాటు చిన్న వ్యాపారులు, హోటల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి సంక్షోభంలో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్రం గ్యాస్ కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. గోదాముల వద్ద ప్రజలు భారీగా క్యూల్లో నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, ఇరువురు ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.
ఇంకా, కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల తరువాత గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని 12 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే యోచనలో కేంద్రం ఉందని సమాచారం ఉందని వెల్లడించారు. ఇరాన్‌లో సమస్యలు ఉంటే ఇతర దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సరఫరా సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, సరఫరాను పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.
ప్రభుత్వ వివరణ
బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. రాష్ట్రంలో ఇంధన సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ కొరత లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది.రిఫైనరీలు యధావిధిగా పనిచేస్తున్నాయని, అన్ని జిల్లాలకు రోజువారీ పంపిణీ కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా భయాందోళనలకు గురై వాహనదారులు, గృహిణులు నిల్వలు చేసుకోవద్దని సూచించింది.కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఏవైనా ఇబ్బందులుంటే పౌర సరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1967ను సంప్రదించాలని కోరింది. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా, ఇంధన లభ్యతపై ప్రభుత్వం ఇచ్చిన హామీతో సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించింది.
