Let's talk: editor@tmv.in
గ్యాస్ కొరతపై ఎల్బీ నగర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

గ్యాస్ కొరతపై ఎల్బీ నగర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

నగరంలో ఆటో ఎల్పీజీ కొరత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గంటల తరబడి వేచి చూసినా గ్యాస్ లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎల్బీ నగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్లు బుధవారం భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద నిల్వలు లేకపోవడంతో విసిగిపోయిన డ్రైవర్లు తమ ఆటోలను హైవేపై అడ్డంగా నిలిపివేసి నిరసన తెలిపారు. దీనివల్ల సాగర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, డ్రైవర్లకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.

రోజంతా క్యూలో నిలబడినా గ్యాస్ దొరకడం లేదు, దీంతో మా జీవనోపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలని, గ్యాస్ కొరత లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. సరఫరా క్రమబద్ధీకరించకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగరంలో గత కొన్ని రోజులుగా ఆటో ఎల్పీజీ అవుట్‌లెట్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తుండటం, ప్రైవేట్ అవుట్‌లెట్లు మూతపడటం ఈ నిరసనలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.