
గ్యాస్ ఏజెన్సీ ఆటో వద్ద సిలిండర్లు దోపిడికి యత్నించిన వినియోగదారులు
నగరంలోని గ్యాస్ సిలిండర్ల కొరతపై వచ్చిన వార్తలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. గ్యాస్ బుక్ చేసుకుని రోజులు తరబడి ఎదురు చూస్తున్నా సిలిండర్లు అందకపోవడంతో ఆగ్రహానికి గురైన వినియోగదారులు, ఏజెన్సీ ఆటో వాహనం వద్దకు చేరుకుని బలవంతంగా సిలిండర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలు ఇప్పుడు నెట్టి౦ట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన షేక్‌పేట పరిధిలోని ఫిలింనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట, ఫిలింనగర్ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తాత్కాలిక ఆలస్యం కారణంగా స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లు సరఫరా చేస్తున్న ఆటో వాహనం వద్దకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు చేరుకున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సరఫరా ఆలస్యం కావడంతో, కొందరు సహనం కోల్పోయి నేరుగా సిలిండర్లను ఎత్తుకెళ్లడానికి యత్నించారు.
వినియోగదారుల ఈ చర్యను గమనించిన ఏజెన్సీ సిబ్బంది, మరికొందరు స్థానికులు వారిని అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారినా, పెద్దగా హింసాత్మక ఘటనలు జరగలేదు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి స్థానికులే ముందుకు వచ్చారు.
ఇది ఇలా ఉంటే మరోపక్క, హైదరాబాద్ కర్మాన్‌ఘాట్ పరిధిలో ఆటో డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. ఆటోకి వినియోగించే గ్యాస్ దొరకపోవడంతో, గ్యాస్ కొరతతో తమ ఉపాధిపై ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లలో గ్యాస్ రేటు పెంచడంవల్ల దాని ప్రభావం ఆటో ప్రయాణికులపై పడుతుందని, ఆటో బుకింగ్లు తగ్గిపోయాయని వారు వాపోతున్నారు
కొరతా? పుకార్లా?
సోషల్ మీడియా వేదికల్లో గ్యాస్ కొరతపై విస్తృతంగా వార్తలు ప్రచారం కావడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పుకార్ల ప్రభావంతోనే ప్రజలు ఇలాంటి చర్యలకు దిగినట్లు సమాచారం.
అధికారుల వివరణ
ప్రభుత్వ వర్గాలు మాత్రం నగరంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేస్తున్నాయి. అవసరమైన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలో తాత్కాలిక ఆలస్యం తప్ప మరే సమస్య లేదని వెల్లడించాయి.
ఈ ఘటనతో సోషల్ మీడియా పుకార్లు ఎంత వేగంగా ప్రజల్లో భయాన్ని పెంచగలవో మరోసారి బయటపడింది. అధికారులు ప్రజలు ఆందోళన చెందకుండా, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు.
