Let's talk: editor@tmv.in
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ను భారత్ కు పంపిన అమెరికా

గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ను భారత్ కు పంపిన అమెరికా

Pinjari Chand
20 నవంబర్, 2025

గ్యాంగ్ స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్ తమ్ముడు, టెర్రర్‌ సిండికేట్‌లో కీలక పాత్రదారి అన్మోల్ బిష్ణోయ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది. అమెరికా అధికారులు అతడిని డిపోర్ట్ చేయగా, ఢిల్లీ చేరుకున్న వెంటనే ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. 2022 నుంచి పరారీలో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ పై పలు ఉగ్ర–గ్యాంగ్‌స్టర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2020–23 మధ్య దేశంలో జరిగిన విభిన్న ఉగ్ర కార్యకలాపాలను లారెన్స్–గోల్డీ బ్రార్‌తో కలిసి నడిపినట్టు ఎన్ఐఏ చెబుతోంది. షూటర్లకు సేఫ్‌హౌజ్‌లు, లాజిస్టిక్ సపోర్ట్, విదేశాల నుంచి ఎక్స్‌టోర్షన్ కార్యకలాపాలు ఇవన్నీ అన్మోల్ బిష్ణోయ్ పర్యవేక్షణలో సాగినట్టుగా సంస్థ పేర్కొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 19వ నిందితుడు ఇతడే.

బాబా సిద్దిఖీ హత్యకేసులోనూ

గత అక్టోబరులో బాంద్రాలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో కూడా అన్మోల్ బిష్ణోయ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని టెర్రర్–గ్యాంగ్‌స్టర్ కుట్ర కేసుకు సంబంధించి 2023 మార్చిలోనే అతడిపై చార్జ్‌షీట్ దాఖలైంది. అన్మోల్ బిష్ణోయ్ రాక నేపథ్యంలో ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. టెర్మినల్–3 వద్ద వాహనాల తనిఖీలు, డాగ్‌ స్క్వాడ్‌తో ముమ్మరంగా సెర్చ్‌ ఆపరేషన్లు జరిపారు. పంజాబ్ సింగర్ సిద్దూ మూసెవాలా హత్య, బాబా సిద్దిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపి బెదిరించడం, ఇలాంటి హై-ప్రొఫైల్ కేసుల్లో అతడి పాత్ర బయటపడడంతో ఇప్పటి వరకు ఇతడిపై వివిధ రాష్ట్రాల్లో 32 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

కుటుంబం ఆందోళన

అతడు లారెన్స్‌ తమ్ముడు కాబట్టి టార్గెట్ అవుతున్నాడు. కానీ చట్టాన్ని మేం గౌరవిస్తాం. భారత్‌కు తీసుకొస్తే భద్రత కల్పించాలని అన్మోల్ బిష్ణోయ్ బంధువు రమేశ్ బిష్ణోయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

న్యాయం కావాలి: సిద్దిఖీ కుటుంబం

బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్‌ మాట్లాడుతూ అన్మోల్‌ను అమెరికా నుంచి రప్పించినట్టు మెయిల్ వచ్చింది. మా తండ్రి హత్య వెనుకున్న అసలు కుట్ర బయటకు రావాలి. న్యాయం ఇంకా మిగిలే ఉంది అని అన్నారు.