
గోషామహల్ కుల్సుంపురాలో హైడ్రా కూల్చివేతలు
నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసే పర్వం కొనసాగుతుండగా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కీలక చర్య తీసుకుంది. గోషామహల్ నియోజకవర్గం, ఆసిఫ్‌నగర్ మండలం పరిధిలోని కుల్సుంపురా లో సర్వే నంబర్ 50లోని 1.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని శుక్రవారం హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.110 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అందులో షెడ్లు వేసి విగ్రహ తయారీదారులకు అద్దెకు ఇస్తున్న అశోక్ సింగ్‌పై హైడ్రా ఈ చర్య చేపట్టింది. ఈ భూమిని ప్రజావసరాలకు, ముఖ్యంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం సంకల్పించింది. గజం స్థలం కూడా దొరకని కుల్సుంపురలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టర్ ప్రత్యేకంగా హైడ్రాను అభ్యర్థించారు. స్థానికులు కూడా ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆక్రమణలను తొలగించారు. గతంలో కూడా రెవెన్యూ అధికారులు రెండు సార్లు ఆక్రమణలను తొలగించినప్పటికీ, అశోక్ సింగ్ ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా అద్దెలను అనుభవిస్తున్నాడు. ఈ భూమి తనదేనంటూ అశోక్ సింగ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఆక్రమణను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై అశోక్ సింగ్ దాడులకు పాల్పడినట్టు సమాచారం. అశోక్ సింగ్‌పై లంగర్‌హౌస్, మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్‌గా పేర్కొంటూ 8కి పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఈ స్థలంలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని హైడ్రా అధికారులు తెలిపారు.
