
గోవా రేసే కీలకం: నాగ చైతన్య
భారత రేసింగ్ చరిత్రలో తొలిసారిగా గోవాలో నిర్వహించనున్న ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) నేపథ్యంలో, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు యజమాని, నటుడు నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద స్ట్రీట్ సర్క్యూట్‌లో జరగనున్న ఈ రేసు తమ జట్టుకు ‘మేక్ ఆర్ బ్రేక్’గా మారుతుందని ఆయన తెలిపారు. కారి మోటార్ స్పీడ్‌వేలో జరిగిన మూడో రౌండ్ అనంతరం హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు 81 పాయింట్లతో టీమ్ స్టాండింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న స్పీడ్ డీమన్స్ ఢిల్లీ జట్టుకు కేవలం ఒక పాయింట్ తేడా మాత్రమే ఉండటంతో, గోవా స్ట్రీట్ రేసు టైటిల్ పోరులో కీలకంగా మారనుంది. స్ట్రీట్ సర్క్యూట్లలో ఒక్క మలుపులో ఏకాగ్రత కోల్పోయినా అంతే. సాధారణ ట్రాక్‌లలో రన్-ఆఫ్ జోన్లు ఉంటాయి. కానీ ఇక్కడ వేగంతో పాటు ప్రశాంతత, ఏకాగ్రత చాలా ముఖ్యం. కఠినమైన 12 మలుపులు ఉన్న ఈ ట్రాక్‌లో ప్రతి ల్యాప్, ప్రతి మలుపు కీలకమని నాగ చైతన్య అన్నారు.
జట్టు ప్రధాన డ్రైవర్‌గా ఉన్న బ్రిటిష్ వెటరన్ రేసర్ జాన్ ల్యాంకాస్టర్ అనుభవమే తమ బలమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పోటీల్లో పాల్గొన్న అనుభవం జాన్‌కు ఉంది. స్ట్రీట్ సర్క్యూట్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడంలో అది మాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే ఫార్ములా-ఈ అభివృద్ధి రేసింగ్‌లో అనుభవం కలిగిన గాబ్రియెలా జిల్కోవా జట్టుకు విశ్లేషణాత్మక బలం అందిస్తారని తెలిపారు. ఆమె ఖచ్చితత్వం, క్రమశిక్షణ గోవా స్ట్రీట్ సర్క్యూట్‌లోని సన్నని మలుపులను అధిగమించేందుకు మాకు చాలా అవసరమని అన్నారు. జట్టు లైనప్‌ను పూర్తిచేస్తున్న భారతీయ యువ డ్రైవర్, మాజీ వైస్ చాంపియన్ మహ్మద్ ర్యాన్ పై కూడా నాగ చైతన్య విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయ ప్రతిభకు ర్యాన్ నిదర్శనం. గెలవాలనే తపన, స్థానిక పరిస్థితులపై అవగాహన అతడిని మా జట్టుకు కీలక ఆటగాడిగా మారుస్తున్నాయని పేర్కొన్నారు.
భారతదేశంలో స్ట్రీట్ రేసింగ్ భవిష్యత్తుపై స్పందించిన నాగ చైతన్య, ఈ తరహా రేసులు మోటార్‌స్పోర్ట్స్ అభివృద్ధికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను ముందుండి నడిపించడం నాకు గర్వకారణం. యువ ప్రతిభకు వేదిక కల్పించడం, మోటార్ స్పోర్ట్స్‌పై నా ప్రేమను పంచుకోవడం, తదుపరి తరం భారతీయ రేసర్లను ప్రేరేపించడమే నా లక్ష్యమని ఆయన అన్నారు.
