Let's talk: editor@tmv.in
గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసు: లూత్రా సోదరులకు 5 రోజుల పోలీస్ కస్టడీ

గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసు: లూత్రా సోదరులకు 5 రోజుల పోలీస్ కస్టడీ

Shaik Mohammad Shaffee
18 డిసెంబర్, 2025

గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర గోవా కోర్టు ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ సహ యజమానులైన గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రాలను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. డిసెంబర్ 6న అర్పోర గ్రామంలో ఉన్న నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లూత్రా సోదరులను, థాయ్‌లాండ్ నుంచి డిపోర్ట్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి గోవాకు తీసుకొచ్చారు.

ఆరోగ్య పరీక్షల తర్వాత కోర్టుకు హాజరు

లూత్రా సోదరులను బుధవారం ఉదయం గోవాలోని మోపా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని సియోలిమ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తరువాత మాపూసా జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండుసార్లు వైద్య పరీక్షలు చేసిన తర్వాత, వారిని మాపూసా కోర్టు జడ్జి పూజా సర్దేసాయి ముందు హాజరు పరిచారు. కోర్టు లూత్రా సోదరులను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపాలని ఆదేశించింది.

ఈ అగ్నిప్రమాదంలో తన కుటుంబానికి చెందిన నలుగురిని కోల్పోయిన భావనా జోషి తరఫున న్యాయవాది విష్ణు జోషి కోర్టులో కీలక వాదనలు వినిపించారు. నిందితులు తమ ఆరోగ్యం బాగోలేదని చెబుతూ ప్రత్యేక సౌకర్యాలు కోరుతున్నారని ఆయన తెలిపారు. “ఇది 25 మంది ప్రాణాలు తీసిన ఘోర ఘటన. ఇలాంటి కేసులో ఎలాంటి ప్రత్యేక సడలింపులు ఇవ్వకూడదు” అని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను మళ్లీ వైద్య పరీక్షలకు పంపగా, వారికి ప్రత్యేక సౌకర్యాలు అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. జైలులో తమకు మెత్తటి పరుపు వంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిందితులు కోరగా, కోర్టు ఆ విన్నపాన్ని తిరస్కరించింది.

థాయ్‌లాండ్‌కు పారిపోయిన లూత్రా సోదరులు

నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటలకే లూత్రా సోదరులు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. దీంతో గోవా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేశారు. అలాగే వారి పాస్‌పోర్టులను కూడా రద్దు చేశారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు, థాయ్ అధికారులు డిసెంబర్ 11న వారిని ఫుకెట్‌లో అదుపులోకి తీసుకున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న న్యాయ ఒప్పందాల ప్రకారం, లూత్రా సోదరులను భారత్‌కు డిపోర్ట్ చేశారు.

హత్య కేసుతో సహా పలు ఆరోపణలు

ఈ అగ్నిప్రమాదం కేసులో లూత్రా సోదరులపై హత్యకు సమానం కాని మానవహత్య, నిర్లక్ష్యం, భద్రతా నిబంధనల ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆరోపణల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నైట్‌క్లబ్ మేనేజర్లు, సిబ్బందితో సహా ఐదుగురిని గోవా పోలీసులు అరెస్టు చేశారు.

కీలక దశలో పోలీసు దర్యాప్తు

లూత్రా సోదరులు పోలీసు కస్టడీలోకి రావడంతో, అగ్నిప్రమాదానికి కారణాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘన, ముందస్తు హెచ్చరికల నిర్లక్ష్యం వంటి అంశాలపై లోతైన విచారణ జరపనున్నారు. ఈ విషాద ఘటనలో న్యాయం జరగాలని బాధిత కుటుంబాలు ఆశిస్తున్నాయి.