Let's talk: editor@tmv.in
గోవాలో విషాదం నింపిన రాత్రి

గోవాలో విషాదం నింపిన రాత్రి

Pinjari Chand
8 డిసెంబర్, 2025

పార్టీ సందడితో కిక్కిరిసిన ఆర్పోరా నైట్ క్లబ్… అదే రాత్రి అగ్నికీలల్లో ఆహుతయ్యింది. ఆనందం కోసం చేరిన అడుగులు… ఒక్కసారిగా మరణం వైపునకు పరుగులు పెట్టాయి. సైరన్‌ శబ్దాలతో ఆకాశం మార్మోగిపోయింది. దవానంలా రేగిన మంటలు 25 ప్రాణాలను బుగ్గిపాలు చేసింది. నిశ్శబ్దం ఆవహించిన మృతదేహాలను భద్రపరిచే గది బంధువుల రోదనలతో నిండిపోయింది. తమ బిడ్డల చివరి చూపుల కోసం గాలించే తల్లిదండ్రుల ఆరాటం కంటతడి పెట్టించింది. కాలిపోయిన వెలుగుల్లో సజీవ దహనమైన మృతదేహాలను చూస్తూ నైట్ క్లబ్ సాక్ష్యంగా నిలిచింది. ఆనందాన్ని, సంతోషాన్ని నింపే గోవా రాత్రులు..తీవ్ర దు:ఖాన్ని మోసుకొచ్చాయి.

వీకెండ్ పార్టీ సంబరాలు క్షణాల్లో పెను విషాదంగా మారాయి. ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలోని ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మరణించగా, 6 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఎక్కువ మంది మరణాలకు కారణం ఉక్కిరిబిక్కిరి అయిన పొగ. గ్రౌండ్ ఫ్లోర్‌లో చిక్కుకున్న వారు బయటపడలేకపోయారని ఫైర్ అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. మిగిలిన ఏడుగురి గుర్తింపు ఇంకా జరగాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు ఈ దురంతంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ 50,000 ప్రధాని ప్రకటించారు.

మొదటి అంతస్తులోనే మొదలైన మంటలు

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మొదటి అంతస్తులో (డాన్స్ ఫ్లోర్) మంటలు మొదలయ్యాయి. రద్దీ ఎక్కువగా ఉండటం, తలుపులు చిన్నవిగా ఉండటంతో కస్టమర్లు బయటకు రాలేకపోయారు. కొందరు గ్రౌండ్ ఫ్లోర్‌కు పరుగెత్తి అక్కడ చిక్కుకున్నారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినా ఆపరేట్ చేయడానికి అనుమతించిన అధికారులపైనా, క్లబ్ యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. యజమాని, జనరల్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం అని సీఎం సావంత్ హామీ ఇచ్చారు.

పీక్ టూరిజం సీజన్‌లో జరిగిన ఈ దురంతం బాధాకరం. మేజిస్ట్రీట్ దర్యాప్తు ఆదేశిస్తున్నాం. నిందితులపై కఠినమైన చర్యలు ఉంటాయి అని ఆయన ప్రకటించారు. అయితే ఇటువంటి అగ్ని ప్రమాదాలు గతంలో జరిగినా ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.

అనుమతులు లేకుండానే క్లబ్ నిర్వహాణ

అర్పోరా-నాగోవా పంచాయతీ సర్పంచ్ రోషన్ రెడ్కర్ వెల్లడించిన విషయం ప్రకారం క్లబ్‌ను నడిపిన సౌరవ్ లూథ్రాకు భాగస్వామితో వివాదం ఉంది. పంచాయతీ తనిఖీలో అనుమతులు లేవని తేలింది. డిమాలిషన్ నోటీసు జారీ చేశాం కానీ పంచాయత్ డైరెక్టరేట్ అధికారులు స్టే ఇచ్చారు.

ప్రత్యక్ష సాక్షిగా హైదరాబాద్ పర్యాటకురాలు

హైదరాబాద్‌కు చెందిన పర్యాటకురాలు ఫాతిమా షేక్ (ప్రత్యక్షసాక్షి) మాట్లాడుతూ వీకెండ్ కాబట్టి క్లబ్ నిండా ఉంది. డాన్స్ ఫ్లోర్‌లో కనీసం 100 మంది ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ ఆందోళనతో పరుగులు తీశారు. కొందరు కిందికి పరుగెత్తి కిచెన్‌లో చిక్కుకున్నారు. తాటి ఆకులతో తాత్కాలికంగా కట్టిన నిర్మాణం కావడంతో క్షణాల్లో క్లబ్ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది అని వివరించారు. క్లబ్ అర్పోరా నది బ్యాక్‌వాటర్స్‌లో ఉండటం, ఇరుకైన రోడ్లు, ఎంట్రీ-ఎగ్జిట్ ఒక్కటే ఉండటంతో ఫైర్ ఇంజన్లు కూడా 400 మీటర్ల దూరంలో ఆపాల్సి వచ్చింది. మెుదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌ వరకు పొగ పూర్తిగా నిండిపోవడంతో ఎక్కువ మంది ఉక్కిరిబిక్కిరై చనిపోయారని ఫైర్ అధికారులు తెలిపారు.

ఆఖరు ‘షో’లే

క్లబ్ లో చివరగా బాలీవుడ్ చిత్రమైన షోలే లోని ‘మెహబూబా.. మెహబూబా’ గీతానికి బెల్లీ డ్యాన్స్ చేస్తుండగా పై అంతస్తు నుంచి పొగలు రావడం మొదలైంది. దీంతో అక్కడ ఉన్న మ్యూజిక్ నిర్వహాకులు తమ సామగ్రిని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చిన పర్యాటకులు ‘ఆగ్ లగ్ గయా’ అంటూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అని అనుమానించారు. కానీ ఢిల్లీకి చెందిన పర్యాటకురాలు రియా, హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా షేక్ లాంటి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం డాన్స్ పెర్ఫార్మెన్స్ సమయంలో బాణసంచా (ఫైర్‌వర్క్స్) కాల్చారు. అదే మంటలకు కారణమైంది అని చెప్పారు. మొదటి అంతస్తులోని డాన్స్ ఫ్లోర్‌లోనే మంటలు మొదలై, కింది అంతస్తు కిచెన్‌కు వ్యాపించాయి.

మోర్గ్ బయట బంధువుల ఆందోళన

గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో మరణించిన వారి బంధువులు, స్నేహితులు ఆదివారం ఉదయం నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రి మోర్గ్ (ఆస్పత్రిలో మృతదేహాలను తాత్కాలికంగా భద్రపరచే ఏసీ గది) బయట వేచి ఉన్నారు. ఝార్ఖండ్‌కు చెందిన ఒక గ్రామానికి చెందిన కొందరు బంధువులు ‘మృతదేహాలను మేం తీసుకోం. నైట్‌క్లబ్ యజమాని స్వయంగా వాటిని మా గ్రామానికి తరలించే ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. నలుగురు మా గ్రామానికి చెందిన వంటల సహాయకులు, హెల్పర్లు అని ఝార్ఖండ్ నుంచి వచ్చిన బంధువులు తెలిపారు.

అర్పోరాలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన నందలాల్ నాగ్ మాట్లాడుతూ మా గ్రామం నుంచి నలుగురు ఈ ప్రమాదంలో చనిపోయారని అనుమానిస్తున్నాం. వారిలో ఒకరు నా సోదరుడి కుమారుడు. ఐదేళ్ల క్రితం వీరు గోవాకు వచ్చి హోటల్స్, నైట్‌క్లబ్‌లలో హెల్పర్లు, వంట మనుషులుగా పనిచేస్తున్నారు. మేం మృతదేహాలను తీసుకోం. హోటల్ యజమాని స్వయంగా ఝార్ఖండ్‌లోని మా గ్రామానికి తరలించే బాధ్యత వహించాలి అని నందలాల్ డిమాండ్ చేశారు. అస్సాంకు చెందిన ఐదుగురు వ్యక్తుల బృందం కూడా మోర్గ్ బయట కనిపించింది. వీరు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు కానీ, మృతుల్లో కొందరు తమ స్నేహితులని ఒకరు చెప్పారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలుపుతూ అన్ని మృతదేహాల గుర్తింపు, పోస్ట్‌మార్టం పూర్తయ్యేందుకు ఒక రోజు పడుతుంది. పోలీసులు పంచనామా పూర్తి చేసిన తర్వాతే పోస్ట్‌మార్టం జరుగుతుంది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం అని వివరించారు.

రాజకీయంగా విమర్శలు

ఆమ్ ఆద్మీ పార్టీ గోవా యూనిట్ నాయకుడు అమిత్ పాలేకర్ మాట్లాడుతూ ఈ ఘటన తర్వాత సావంత్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. అసెంబ్లీలోనే ఈ క్లబ్ అక్రమాల గురించి ప్రస్తావించినా ఎందుకు చర్య తీసుకోలేదు? అని ప్రశ్నించారు. గోవా చర్చి కూడా ప్రాణనష్టంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పర్యాటక రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఇది యాదృచ్ఛికం కాదు – సేఫ్టీ, పరిపాలనలో నేరపూరిత వైఫల్యం అని రాహుల్ గాంధీ విమర్శించారు.

పరిహారం ప్రకటించిన సీఎం

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం నార్త్ గోవాలోని అర్పోరాలో ఓ రెస్టారెంట్-క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తామని తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన సీఎం సావంత్ మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఘటనకు కారణమైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించామని సావంత్ చెప్పారు. ఈ అగ్నిప్రమాదంపై మేజిస్టీరియల్ విచారణ జరిపేందుకు జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు, ఫోరెన్సిక్, అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారులతో కూడిన కమిటీని గోవా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు దారితీసిన లోపాలపై నివేదికను ఒక వారంలోగా సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. క్లబ్ యజమాని, మేనేజర్, అనుమతులు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న క్లబ్‌లు, వ్యాపార సముదాయాలపై ఆడిట్ నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించినట్లు సీఎం చెప్పారు. అన్ని క్లబ్‌లు, రెస్టారెంట్లు, భారీగా జనం సమావేశమయ్యే వాణిజ్య సముదాయాలకు ఈ ఎస్వోపీ వర్తిస్తుందని, చెల్లుబాటు అయ్యే అనుమతులు, తగిన భద్రతా ఏర్పాట్లతోనే నడపాలని రాష్ట్ర విపత్తు నివారణ అథారిటీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.