Let's talk: editor@tmv.in
గోవాలో ప్రైవేట్‌ బిల్లులను బీజేపీ అడ్డుకుంటోంది: ఆమ్ఆద్మీ పార్టీ

గోవాలో ప్రైవేట్‌ బిల్లులను బీజేపీ అడ్డుకుంటోంది: ఆమ్ఆద్మీ పార్టీ

Pinjari Chand
15 మార్చి, 2026

గోవా భూములు, నదులు, పర్యావరణాన్ని రక్షించేందుకు తీసుకువచ్చిన కీలక ప్రైవేట్ మెంబర్స్ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ గోవా యూనిట్ బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. శనివారం ఆప్ గోవా నాయకుడు సందేశ్‌ టెలీకర్ డెస్సాయి మీడియాతో మాట్లాడుతూ గోవా అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రజల జీవనాధారం, పర్యావరణం, రాష్ట్ర గుర్తింపుతో సంబంధం ఉన్న అంశాలను తమ ఎమ్మెల్యేలు నిరంతరం సభలో లేవనెత్తుతున్నారని ఆయన చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలు వెంజీ వైగస్‌, క్రుజ్‌ సిల్వా గోవా ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను నిరంతరం ప్రస్తావిస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం బలమైన ప్రతిపక్షానికి భయపడి ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకుందని వారు ఆరోపించారు.

ప్రభుత్వం ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా గోవా భూములు, సహజ వనరులను శక్తివంతమైన వర్గాల నుంచి రక్షించే చట్టాలను తాము భయపడుతున్నామని చూపించిందని టెలీకర్ డెస్సాయి అన్నారు. ఈ బిల్లులు వ్యవసాయ భూములు, పర్యావరణం, సంప్రదాయ జీవన విధానాలను రక్షించేందుకు ఉద్దేశించినవని ఆయన చెప్పారు.

ఆప్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రశాంత్ నాయక్‌ మాట్లాడుతూ భారీ స్థాయిలో భూసంస్కరణలు జరుగుతున్నాయని, అలాగే సెక్షన్‌ 39ఏపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసి గోవా ప్రోటెక్షన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌‌ ల్యాండ్‌ బిల్స్‌ 2026ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించారని చెప్పారు. ఈ బిల్లు వ్యవసాయ భూములు, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలను భవిష్యత్ తరాల కోసం కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు.

ఆప్ దక్షిణ గోవా యువ విభాగం అధ్యక్షుడు నియష్‌ కౌటిన్హో మాట్లాడుతూ పరిశ్రమల వ్యర్థాలు, వైద్య వ్యర్థాల వల్ల గోవా నదులు, వాగులు కాలుష్యానికి గురవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ ఈ సమస్యలను పరిష్కరించే ఇరిగేషన్ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనివ్వలేదని విమర్శించారు. వ్యవసాయ భూముల మార్పిడి, కాసినో విస్తరణ, సహజ వనరులపై వాణిజ్య నియంత్రణ వంటి అంశాలు శక్తివంతమైన వర్గాలకు లాభం చేకూర్చే విధంగా జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆరోపించారు. సాధారణ ప్రజలు మాత్రం భూములు, పర్యావరణం, జీవనాధారాలను కోల్పోతున్నారని వారు అన్నారు. గోవా భూములు, నదులు, పర్యావరణం, రాష్ట్ర గుర్తింపును రక్షించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ఆప్‌ గోవా యూనిట్ స్పష్టం చేసింది.

గోవాలో ప్రైవేట్‌ బిల్లులను బీజేపీ అడ్డుకుంటోంది: ఆమ్ఆద్మీ పార్టీ - Tholi Paluku