Let's talk: editor@tmv.in
గోవాలో ‘టేల్స్ ఆఫ్ కామసూత్ర’ ఈవెంట్ పై వివాదం

గోవాలో ‘టేల్స్ ఆఫ్ కామసూత్ర’ ఈవెంట్ పై వివాదం

Pinjari Chand
25 నవంబర్, 2025

సోషల్ మీడియాలో ప్రచారమైన ‘టేల్స్ ఆఫ్ కామసూత్ర అండ్ క్రిస్ట్మస్ సెలబ్రేషన్స్’ ఈవెంట్‌పై తీవ్రంగా ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో గోవా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. వచ్చే నెల జరగాల్సిన ఈ ఈవెంట్‌ను నిలిపివేయాలని, సంబంధిత ప్రకటనలన్నీ తొలగించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భగవాన్ శ్రీ రజనీష్ ఫౌండేషన్ పేరుతో ఈ నాలుగు రోజుల ఈవెంట్‌ రద్దయ్యింది.

ప్రచారం వెంటనే నిలిపివేయాలి- గోవా పోలీసులు

ఈ విషయాన్ని వెంటనే గుర్తించినట్లు పోలీసు శాఖ బహిరంగ ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా నుంచి ప్రకటనలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను భవిష్యత్తులో జరిగే ఇలాంటి కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది.

గోవాను సెక్స్ డెస్టినేషన్‌గా చూపించడం దారుణం- ఫిర్యాదుదారు

గోవా కేంద్రంగా పని చేసే ఎఆర్జడ్ (అన్యాయ్ రహిత్ జిందగీ) ఎన్జీవో ఫౌండర్ అరుణ్ పాండే ఫిర్యాదు చేశారు. “ఓషో, క్రిస్మస్, మెడిటేషన్ పేరిట గోవాను సెక్స్ డెస్టినేషన్‌గా చూపించడం చాలా దౌర్భాగ్యం అని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.

ఈ ప్రచారం పై గోవా క్రైమ్ బ్రాంచ్‌కి లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కాథలిక్ అసోసియేషన్ ఫిర్యాదు

గోవా కాథలిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిల్ ఏ. ఫెర్నాండెజ్ నేతృత్వంలో పోలీసుల వద్ద మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఈవెంట్ మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తోందని, లైంగిక నేరాలను ప్రోత్సహించేలా ఉందని ఆరోపించారు.

పవిత్ర క్రిస్మస్‌కు అవమానకరం - ఆర్చ్‌బిషప్

గోవా–దమన్ ఆర్చ్‌బిషప్ ఫిలిప్ నెరి కార్డినల్ ఫెర్రావో తీవ్ర విమర్శలు చేశారు. క్రిస్మస్ క్రైస్తవ ప్రపంచానికి పవిత్రమైన సమయం, దేవుని ప్రేమ స్మరణ, శాంతి–సంతోషాల కాలం అని గుర్తుచేస్తూ అలాంటి పర్వదినాన్ని అసలు సంబంధం లేని, విరుద్ధమైన అంశాలతో అనుసంధానించడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఈ రకమైన పోస్టర్లు ఒక సమాజం మత విశ్వాసాలను అవమానపరచడమే కాకుండా, పరస్పర గౌరవం, సామాజిక మర్యాద వంటి విలువలను దెబ్బతీస్తాయని ఆర్చ్‌బిషప్ అభిప్రాయపడ్డారు.

వెంటనే ఈ ప్రకటనలను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంపై అధికారాలు దర్యాప్తు జరపాలని కూడా ఆయన కోరారు.

స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉంది

మతపరమైన విలువలను కించపరిచే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కాథలిక్ సమాజానికి ఆర్చ్‌బిషప్ పిలుపునిచ్చారు. సమాజంలో పరస్పర గౌరవం, అర్థం, సామరస్యతను కాపాడే బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.

గోవాలో ‘టేల్స్ ఆఫ్ కామసూత్ర’ ఈవెంట్ పై వివాదం - Tholi Paluku