
గోవాలో ఆరు సంవత్సరాలు ఉంటేనే పాఠశాలలో అడ్మిషన్
గోవాలో 1 వ తరగతి(క్లాస్–1)లో విద్యార్థుల ప్రవేశానికి కనీస వయస్సును ఐదున్నరేళ్ల నుంచి ఆరు సంవత్సరాలకు పెంచే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)–2009కు అనుగుణంగా రాష్ట్ర చట్టాన్ని సవరించడమే ఈ బిల్లు లక్ష్యంగా ఉంది. శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవా స్కూల్ ఎడ్యుకేషన్ (సవరణ) బిల్లు–2026ను శాసనసభలో ప్రవేశపెట్టారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గోవా స్కూల్ ఎడ్యుకేషన్ చట్టం–1984లోని సెక్షన్ 18 ప్రకారం, ఐదు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలకు మొదటి తరగతిలో ప్రవేశం కల్పించే వెసులుబాటు ఉంది. తాజా బిల్లుతో ఆ నిబంధనను సవరించనున్నారు. ప్రతిపాదిత సవరణ ప్రకారం, సంబంధిత విద్యాసంవత్సరంలోని జూన్ 1 నాటికి ఆరు సంవత్సరాలు పూర్తికాని పిల్లలు 1వ తరగతి లేదా దానికి సమానమైన తరగతుల్లో గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేరేందుకు అర్హులు కారు.
నిబంధనలు కఠినం
అయితే, ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా 2025–26 విద్యాసంవత్సరానికి ఒకసారి మాత్రమే సడలింపు కల్పించారు. జూన్ 1, 2025 నాటికి ఐదు సంవత్సరాల ఆరు నెలలు నిండిన పిల్లలు 1వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అలాగే, 1వ తరగతి కంటే పై తరగతుల్లో మొదటిసారి ప్రవేశం కోరుకునే విద్యార్థుల వయస్సు అర్హతల విషయంలో కూడా నిబంధనలను కఠినతరం చేశారు. ఆ తరగతి నుంచి క్లాస్–1 వరకు సాధారణంగా అవసరమైన సంవత్సరాలను తీసివేసిన తర్వాత, విద్యార్థి వయస్సు ఆరు సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటే అతడికి ప్రవేశం ఉండదని బిల్లు స్పష్టం చేసింది. ఈ సవరణల ద్వారా ఎన్ఈపీ–2020, ఆర్టీఈ చట్టాలలో పేర్కొన్న ఆరు సంవత్సరాల కనీస వయస్సు ప్రమాణాన్ని ఖచ్చితంగా అమలు చేయడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రవేశాలు ఇకపై కూడా ప్రభుత్వం రూపొందించే నిబంధనల ప్రకారమే నడుస్తాయని బిల్లు స్పష్టం చేసింది. ఈ సవరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల్లో వయస్సు పరిమితులు, కట్‌ఆఫ్ తేదీలు విద్యాసంవత్సరానుసారం మారుతూ ఉండేవని, తాజా సవరణతో ఆ అసమానతలకు ముగింపు పలికి జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గోవా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లో ఇప్పటికే ఈ విధానం కొనసాగుతోంది. బిల్లు ఆమోదం పొందితే వాటి సరసన గోవా కూడా చేరేందుకు సిద్ధంగా ఉంది.
