
గోల్కొండ: సంపద, యుద్ధాల ప్రతిధ్వని
హైదరాబాద్ నగరపు ఆధునిక హోరుకు కాస్త దూరంగా, గంభీరంగా నిలబడి ఉన్న ఆ రాతి గోడలను చూస్తుంటే.. అవి కేవలం కట్టడాలు కావనిపిస్తుంది. అవి శతాబ్దాల చరిత్రను తమ గుండెల్లో దాచుకున్న మౌన సాక్ష్యాలు. ఒకప్పుడు ప్రపంచానికే వజ్రాల వెలుగులను పంచిన ఈ కోట, నేడు శిథిలమై ఉండవచ్చు. కానీ, అక్కడి ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. గొల్లకొండ' గా పిలవబడిన ఆ చిన్న మట్టి కొండ, ఒక సామ్రాజ్యానికి గుండెకాయగా ఎలా మారిందో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ కోట ద్వారాల దగ్గర వినిపించే ప్రతిధ్వని, అప్పట్లో జరిగిన యుద్ధాల హోరును, సైనికుల వీరత్వాన్ని గుర్తుచేస్తుంది.
గోల్కొండ అంటే కేవలం సంపద మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి. హిందూ-ముస్లింల ఐక్యతకు నిదర్శనమైన జగదాంబ ఆలయం, సుల్తానుల మసీదులు పక్కపక్కనే ఉండటం ఆ కాలం నాటి గొప్పతనాన్ని చాటి చెబుతుంది. కానీ, ఎనిమిది నెలల పాటు శత్రువుకు లొంగని ఆ పౌరుషం, చివరికి ఒక ద్రోహం వల్ల కుప్పకూలిపోయిన తీరు తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది. నేడు మనం చూస్తున్న ఆ శిథిల గోడల వెనుక.. రాణుల నవ్వులు, కవుల కవిత్వాలు, వజ్రాల తళతళలు మరియు రాజ్య పతనం నాటి ఆవేదన దాగి ఉన్నాయి. కాలం ప్రవాహంలో రాజులు పోయారు, రాజ్యాలు మారాయి.. కానీ గోల్కొండ మాత్రం తన పూర్వ వైభవాన్ని గుర్తుచేస్తూ, తెలుగు నేల గర్వించదగ్గ ఒక జ్ఞాపకంగా నేటికీ నిలిచే ఉంది.
గొల్లకొండ నుండి సామ్రాజ్య కేంద్రం వరకు
గోల్కొండ కథ 11వ శతాబ్దంలో చాలా సామాన్యంగా ప్రారంభమైంది. ఒక గొర్రెల కాపరి బాలుడు అప్పట్లో "మంగలవరమ్" అని పిలువబడే కొండపై ఒక దేవతా విగ్రహాన్ని కనుగొన్నట్లు చరిత్ర చెబుతుంది. అప్పటి కాకతీయ రాజుకు ఈ విషయం తెలియజేయగా, ఆయన ఆ పవిత్ర స్థలం చుట్టూ మట్టి కోటను నిర్మించాలని ఆదేశించారు. ఈ మూలమే "గొల్ల కొండ" అనే పేరులో నిలిచిపోయింది (తెలుగులో గొర్రెల కాపరుల కొండ అని అర్థం).
గోల్కొండ కోట , ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ కు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి క్రీ.శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. 1343 లో కమ్మచక్రవర్తి ముసునూరి కాపయ నాయుడు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించాడు. చక్రవర్తి ముసునూరి కాపయ నాయుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాన్ అయిన మహమ్మదు షా వశము చేశాడు. కాకతీయ, ముసునూరి కమ్మనాయక రాజుల తరువాత బహమనీ చేతులోకి గోల్కొండ చేరినది.
అయితే, 14వ శతాబ్దంలో ఈ కోట రూపురేఖలు మారిపోయాయి. బహమనీ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత, ఇది సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ అనే గవర్నర్‌కు నిలయంగా మారింది. బహమనీ సామ్రాజ్యం అంతర్గతంగా బలహీనపడటంతో, 1518లో సుల్తాన్ కులీ స్వతంత్రుడిగా ప్రకటించుకుని, కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించాడు. తరువాతి 62 ఏళ్లలో, మట్టి గోడల స్థానంలో భారీ గ్రానైట్ రాళ్లు వచ్చి చేరాయి, దీనితో గోల్కొండ ప్రపంచంలోని అత్యంత దుర్భేద్యమైన కోటలలో ఒకటిగా మారింది.
ఇంజనీరింగ్ అద్భుతాలు: ధ్వని, రాతి విజ్ఞానం
గోల్కొండ దాని అధునాతన రూపకల్పన, ముఖ్యంగా దాని ధ్వని సంకేత వ్యవస్థ వాస్తుశిల్పులు, ఇంజనీర్లచే నిర్మించబడిన అధ్బుతాలలో ఒకటి. ఫతే దర్వాజా (విజయోత్సవ ద్వారం)ప్రవేశ ద్వారం ఒక అద్భుతమైన భద్రతా వ్యవస్థకు ఆరంభం. ఈ ద్వారం గోపురం కింద ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద చప్పట్లు కొడితే, అది దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కోటలోని ఎత్తైన ప్రాంతమైన బాలా హిస్సార్ పెవిలియన్‌లో స్పష్టంగా వినిపిస్తుంది. ఇది కేవలం వినోదం కోసం కాదు. శత్రువుల రాకను రాజకుటుంబీకులకు హెచ్చరించడానికి రూపొందించిన ఒక "హై-టెక్" అలర్ట్ సిస్టమ్.
అలాగే విద్యుత్తు లేని ఆ కాలంలోనే, కుతుబ్ షాహీ ఇంజనీర్లు సంక్లిష్టమైన హైడ్రాలిక్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. పర్షియన్ చక్రాలు, వరుస ట్యాంకులను ఉపయోగించి, వారు వందల అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ప్యాలెస్‌లకు నీటిని తరలించేవారు. దీనివల్ల ముట్టడి సమయంలో కూడా రాజకుటుంబానికి నీరు, పచ్చని తోటలు అందుబాటులో ఉండేవి. కోట మూడు వరుసల గోడలతో రక్షించబడింది. బయటి గోడ సుమారు 7 కిలోమీటర్ల పొడవు ఉండి, 87 అర్ధవృత్తాకార బురుజులను కలిగి ఉంటుంది. శత్రువుల ఏనుగులు ఢీకొట్టి తలుపులను పడగొట్టకుండా ఫతే దర్వాజా వంటి ద్వారాలకు భారీ ఇనుప మేకులను అమర్చారు.
గోల్కొండ జల విజ్ఞానం- కొండపైకి నీటిని మళ్లించిన వైనం
గోల్కొండ కోటలో అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయం దాని నీటి సరఫరా వ్యవస్థ. 400 అడుగుల ఎత్తులో ఉన్న రాజ ప్రాసాదాలకు, ఉద్యానవనాలకు ఆ కాలంలోనే నిరంతరం నీరు అందేలా కుతుబ్ షాహీ ఇంజనీర్లు అద్భుతమైన ప్రణాళిక చేశారు. కోట దిగువన ఉన్న చెరువుల నుండి నీటిని పైకి పంపింగ్ చేయడానికి ఎద్దులతో నడిచే పర్షియన్ చక్రాలను ఉపయోగించేవారు. ఇవి నీటిని వరుసగా ఒక స్థాయి నుండి మరొక స్థాయికి చేరవేసేవి. కోట గోడల లోపల భూమి అడుగున కాల్చిన మట్టి పైపులను అమర్చారు. వీటి ద్వారా నీరు ప్యాలెస్‌లలోని స్నానశాలలకు, వంటశాలలకు మరియు ఫౌంటైన్లకు చేరేది. నేటికీ మనం ఆ పైపుల శిథిలాలను కోట గోడల మధ్య చూడవచ్చు. కొండపై భాగంలో భారీ నీటి ట్యాంకులను నిర్మించి, అక్కడి నుండి గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు కోట అంతటా ప్రవహించేలా చేశారు. దీనివల్ల శత్రువులు కోటను ముట్టడించినప్పుడు కూడా నీటి కొరత ఉండేది కాదు.
కోటలోని కొన్ని ఆసక్తికర రహస్యాలు
అర్థం కాని రహస్య సొరంగం:
గోల్కొండ కోట నుండి చార్మినార్ వరకు ఒక రహస్య భూగర్భ సొరంగం ఉందని ఒక బలమైన నమ్మకం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా శత్రువులు దాడి చేసినప్పుడు రాజ కుటుంబీకులు సురక్షితంగా తప్పించుకోవడానికి దీనిని నిర్మించారని చెబుతారు. అయితే, ఇప్పటి వరకు దీని ఉనికికి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు, కానీ కోటలో కొన్ని మూసివేసిన మార్గాలు ఈ నమ్మకానికి బలం చేకూరుస్తాయి. కోట పక్కనే ఉన్న నయా ఖిల్లాలో ఒక భారీ బాబోబ్ చెట్టు ఉంది. దీని కాండం లోపల ఒక పెద్ద గది లాంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం, ఈ చెట్టు లోపల దొంగలు దాక్కునేవారట. దీనిని ఆ కాలంలో ఒక రహస్య స్థావరంగా వాడేవారు. కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారా దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు. సమయములలో శత్రువుల పోకడలను గమనించుటకు వీలుగా బాలాహిసార్ ద్వారముల కెదురుగా నిర్మింపబడిన తెరవంటి గోడ. బాలాహిసార్ గేటుకు వెలుపలి భాగములో ఒక రంధ్రము ఉంటుంది. యుద్ధ సమయములో శత్రువు గేటు ద్వారా ఏనుగులతో తోయించే సమయంలో దీని నుండి కాగుతున్న నూనెను కాని, కరిగిన లోహమునుకాని పోసేవారు.
నగీనా బాగ్ - వజ్రాల తోట:
కోట లోపల 'నగీనా బాగ్' అనే అందమైన తోట ఉండేది. ఇక్కడే విదేశీ వ్యాపారుల సమక్షంలో ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల వేలం జరిగేదని చరిత్రకారులు చెబుతారు. రాణి వాసంలో దర్బార్ హాల్‌లలో గాలి ప్రసరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, వేసవి కాలంలో కూడా అక్కడ చల్లగా ఉంటుంది. గోడల నిర్మాణం, కిటికీల అమరిక వల్ల సహజంగానే గాలి చల్లబడి లోపలికి వచ్చేలా డిజైన్ చేశారు.
బారాదరి
ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి గోషామహల్ బారాదరి హైదరాబాద్ కు భూమార్గము కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో ఉబనన మొత్తం పరిసరాలు అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తాయి. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్ చెరువు, హైదరాబాద్ నగరంలో ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్ ఆలమ్ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్ సాగర్(గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుస్సేన్ సాగర్ చెరువు, సికింద్రాబా ద్ నగరం, ఉస్మానియా యూనివర్సిటీ చూడవచ్చు. ఉత్తర పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరంగా గోల్కొండ కోట పట్టణం, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
ప్రపంచ వజ్రాల రాజధాని
శతాబ్దాలుగా, ఇంగ్లీష్ భాషలో "గోల్కొండ" అనే పదం "అపారమైన సంపద"కు పర్యాయపదంగా ఉండేది. కొల్లూరు గనులు, కోట గోడల లోపల వర్ధిల్లిన వజ్రాల వ్యాపారం వల్ల ఈ ఖ్యాతి వచ్చింది. పునరుజ్జీవన కాలంలో ప్రపంచంలో వజ్రాలకు భారతదేశం ఒక్కటే మూలాధారం, గోల్కొండ దానికి ప్రధాన వాణిజ్య కేంద్రం. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాలు ఈ కోట ఖజానా నుండే వెలుగు చూశాయి. ఇక్కడ లభించిన కోహినూర్ ప్రస్తుతం బ్రిటిష్ కిరీటంలో భాగం. హోప్ డైమండ్ గా ప్రసిద్ధి చెందిన అరుదైన నీలి రంగు వజ్రం ఇక్కడిదే. దరియా-ఇ-నూర్ ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలలో ఒకటి, ప్రస్తుతం ఇరాన్‌లో ఉంది. దీనిచరిత్ర కూడా ఇక్కడే మొదలయ్యింది. రీజెంట్ డైమండ్ అనిపిలవబడే వజ్రం ఫ్రెంచ్ రాజ ఆభరణాలలో ప్రధానమైనది.ఇది కూడా గోల్కొండ నుండి జారిపోయి వెళ్ళినదే. ఈ వజ్రాలు వాటి స్వచ్ఛతకు ప్రసిద్ధి. ఆధునిక రత్న శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ రకమైన నాణ్యతను "గోల్కొండ గ్రేడ్" మార్క్ అని పిలుస్తారు.
సంస్కృతి, మతాల సమ్మేళనం
గోల్కొండ ముస్లిం సుల్తానుల పాలనలో ఉన్నప్పటికీ, దాని వాస్తుశిల్పం, సామాజిక జీవనం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేది. కుతుబ్ షాహీలు స్థానిక సంస్కృతిని తెలుగు భాషను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందారు.దీనికి నిదర్శనం కోటలో ఆలయం.
జగదాంబ దేవాలయం:
కోట పైభాగంలో, రాజ మసీదుకు సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇది కాకతీయ కాలం నాటిది. సుల్తాన్ కోట నడిబొడ్డున ఒక హిందూ దేవాలయం శతాబ్దాలుగా గౌరవించబడటం ఆ కాలం నాటి మత సామరస్యానికి నిదర్శనం. ఏటా బోనాల సమయంలో వేలాది మంది భక్తులు జగదాంబ ఆలయానికి తరలిరావడంతో కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.
భక్తికి, బంధీఖానాకు సాక్షి - గోల్కొండ
గోల్కొండ కోట అంటే కేవలం రాజుల విలాసాలు, వజ్రాల రాశులే కాదు.. అది ఒక పరమ భక్తుడి ఆవేదనకు, అచంచలమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యం. భద్రాచలంలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుండి అరవై లక్షల రూపాయల వరకు వెచ్చించారనే ఆరోపణతో, అప్పటి తానీషా చక్రవర్తి రామదాసును గోల్కొండ కోటలోని ఒక చీకటి గదిలో బంధించారు. నేటికీ కోటలో ‘రామదాసు బందీఖానా'గా పిలవబడే ఆ గది గోడలపై రామదాసు స్వహస్తాలతో చెక్కిన శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను చూస్తుంటే, ఆ కటిక చీకటిలో ఆయన అనుభవించిన వేదన, ఆ భక్తి పారవశ్యం మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. తన ఆరాధ్య దైవం కోసం పన్నెండేళ్ల పాటు ఆయన పడిన కష్టాలు, ఆ కోట రాళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
శ్రీరామరక్ష - తానీషాకు కలిగిన జ్ఞానోదయం
రామదాసు బందీఖానాలో ఉండి ఆక్రందన చేస్తూ పాడిన "పాహి రామప్రభో" వంటి కీర్తనలు గోల్కొండ గోడలను సైతం కరిగించాయి. పురాణాల ప్రకారం, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే 'రామ' 'లక్ష్మణ' అనే ఇద్దరు సేవకుల రూపంలో వచ్చి, తానీషాకు ఆరు లక్షల రామటంకీ నాణేలను చెల్లించి రామదాసును విముక్తుడిని చేశారని ప్రతీతి. ఒక ముస్లిం రాజు పాలనలో ఉన్న కోటలో, ఒక హిందూ భక్తుడి కోసం దైవమే దిగివచ్చిన ఈ వృత్తాంతం గోల్కొండ చరిత్రకు ఒక ఆధ్యాత్మిక సౌరభాన్ని అద్దింది. అందుకే పర్యాటకులు గోల్కొండకు వెళ్ళినప్పుడు ఆ రాజ సౌధాల కంటే ఎక్కువగా, రామదాసు రామనామం జపించిన ఆ బందీఖానానే అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.
కుతుబ్ షాహీ సమాధులు:
కోట గోడల వెలుపల ఉన్న ఈ సమాధులు పర్షియన్, పఠాన్ హిందూ నిర్మాణ శైలుల అద్భుత సమ్మేళనం. ఈ "నగరం వంటి స్మశానవాటిక" భారతదేశంలోని అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి.
పతనం: ఎనిమిది నెలల పోరాటం
గోల్కొండ వైభవం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అసూయకు కారణమైంది. 1687లో ఆయన దక్కన్ సుల్తానులను అంతం చేయడానికి సైన్యంతో తరలివచ్చారు. గోల్కొండ ముట్టడి భారతీయ సైనిక చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. మొఘల్ సైన్యం సంఖ్యాపరంగా పెద్దదైనప్పటికీ, కోట ఎనిమిది నెలల పాటు లొంగలేదు. కానీ, చివరికి సైనిక బలం వల్ల కాకుండా కుట్ర వల్ల కోట పడిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఒక ద్రోహి "ఫతే దర్వాజా" తలుపులు తెరవడంతో మొఘల్ సైన్యం లోపలికి ప్రవేశించింది. చివరి రాజు అబుల్ హసన్ తానా షా బందీ కావడంతో, ఈ వంశ పాలన అంతమైంది.
నేటి గోల్కొండ: సజీవ వారసత్వం
నేడు గోల్కొండ చరిత్రకారులకు, పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడి దర్బార్ హాల్, అంబర్ ఖానా (ధాన్యపు కొట్టు), నగీనా బాగ్ వంటి కట్టడాలు 16వ శతాబ్దపు వైభవాన్ని మన కళ్లకు కడతాయి. సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రతి సాయంత్రం కోట చరిత్రను వివరించే కాంతి, ధ్వనితో ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ 400 ఏళ్ల నాటి ప్రసిద్ధ ఆఫ్రికన్ బావోబాబ్ చెట్టు (హథియాన్ కా ఝాడ్) ఉంది.
గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధుల ఒక్క రోజు పర్యటన
మీ పర్యటనను ఉదయాన్నే ప్రారంభించడం మంచిది. దీనివల్ల ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. కోటను నిదానంగా చూడవచ్చు. ప్రధాన ద్వారంవద్ద చప్పట్లు కొట్టి ధ్వని ఎలా ప్రయాణిస్తుందో స్వయంగా చూడండి.బాలా హిస్సార్ అని పిలవబడే కోట పైభాగానికి వెళ్లే దారిలో అందమైన వ్యూ పాయింట్లు, ఆయుధశాలలను చూడవచ్చు. భక్త రామదాసు పన్నెండేళ్ల పాటు బందీగా ఉన్న గదిని మరియు ఆయన చెక్కిన విగ్రహాలను దర్శించుకోండి. బాలా హిస్సార్ పెవిలియన్ చోట నిలబడి కోట శిఖరాగ్రం నుండి హైదరాబాద్ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించండి. దాదాపు 300 నుండి 400 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, కాబట్టి సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. కోట సమీపంలోని టోలిచౌకి ప్రాంతంలో అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ కోసం షా ఘౌస్ లేదా మెహఫిల్ రెస్టారెంట్లకు వెళ్లవచ్చు. మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు కుతుబ్ షాహీ సమాధులు చూడవచ్చు. కోట నుండి కేవలం 1-2 కిలోమీటర్ల దూరంలోనే ఈ సమాధులు ఉన్నాయి. ఏడుగురు కుతుబ్ షాహీ రాజుల సమాధులను ఇక్కడ చూడవచ్చు. ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించిన ఈ భారీ గోపురాలు ఫొటోగ్రఫీకి చాలా బాగుంటాయి.
ప్రశాంతమైన ఉద్యానవనాల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. కోట సమీపంలో ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు రుచి చూడండి. సాయంత్రం 6:30 - 7:30 లేదా 8:00 లకు మళ్ళీ గోల్కొండ కోట వద్దకు చేరుకుని సౌండ్ అండ్ లైట్ షో చూడవచ్చు. షో సాధారణంగా సాయంత్రం 6:30కి మొదలవుతుంది. ఇది ఇంగ్లీష్ షో ఉంటుంది. తెలుగు షో సీజన్‌ను బట్టి రాత్రి 8:00 గంటలకు (నవంబర్ - ఫిబ్రవరి) లేదా 8:15 గంటలకు (మార్చి - అక్టోబర్) ఉంటుంది. ఈ షో ద్వారా కోట చరిత్రను అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల గొంతుతో వినడం ఒక గొప్ప అనుభూతి. వెంట వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉంచుకోండి. కోట చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి ఒక గుర్తింపు పొందిన గైడ్‌ను నియమించుకోవడం మంచిది. ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉంది, కానీ డ్రోన్లకు అనుమతి లేదు.
గోల్కొండ కేవలం రాళ్ల కుప్ప కాదు. అది మానవ మేధస్సుకు ఒక శిఖరాగ్రం. శాస్త్రం (ధ్వని, జల విజ్ఞానం), వాణిజ్యం (వజ్రాల వ్యాపారం), కళలు సంగమించిన ప్రదేశం ఇది. వజ్రాలు విదేశీ మ్యూజియాలకు తరలిపోయినా, రాజ దర్బార్లు నిశ్శబ్దమైనా, "గోల్కొండ ప్రతిధ్వని" ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. దక్కన్ పీఠభూమిలోని రాతి గ్రానైట్ కొండలపై గంభీరంగా వెలిసిన గోల్కొండ కోట కేవలం ఒక శిథిలం మాత్రమే కాదు. ఇది సామ్రాజ్యాల ఉత్థాన పతనాలకు, ఆ కాలం నాటి అపార సంపదకు, సైనిక ఇంజనీరింగ్ పరిణామాలకు ఒక నిశ్శబ్ద సాక్షి. హైదరాబాద్ పశ్చిమ శివార్లలో ఉన్న ఈ కోట కేవలం ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో భారతదేశం కేంద్రబిందువుగా ఉన్న కాలానికి, ఇస్లామిక్, హిందూ నిర్మాణ శైలులు కలిసి ఒక ప్రత్యేకమైన "దక్కనీ" శైలిని సృష్టించిన కాలానికి ఇది ఒక చిహ్నం.
