Let's talk: editor@tmv.in
గోల్కొండ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

గోల్కొండ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

Gaddamidi Naveen
11 జులై, 2026

ఆషాడ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం, వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గోల్కొండ కోటలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి బోనం సంప్రదాయబద్ధంగా గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికే సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే బోనం సమర్పణ, తొట్టెలు రథం ఊరేగింపు, మెట్ల పూజ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక సదుపాయాలు, ప్రత్యేక బస్సుల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.

దేవాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోట పరిధిలోని రహదారులు, మెట్లు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు, షెడ్లు తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

ఉత్సవాల కాలమంతా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సహకరించాలని ఆదేశించారు. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని సంతృప్తిగా ఇళ్లకు వెళ్లేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు
Bonalu2026AshadaBonaluGolcondaBonaluJagadambikaMahankaliHyderabadBonaluTelanganaFestivalsTelanganaCultureGangaJamunaTehzeebKondaSurekha
గోల్కొండ బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ - Tholi Paluku