
గోదావరి పుష్కరాలు 2027: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
2027లో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి నిర్వహణపై ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశం జరిగింది.
గోదావరి పుష్కరాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా భక్తులకు సౌకర్యవంతమైన రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రతా ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ బాసర నుంచి భద్రాచలం వరకు ఒక ఆధ్యాత్మిక దేవాలయ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. దీని ద్వారా భక్తులకు ఒకే మార్గంలో ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలకు కోట్ల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
అదేవిధంగా, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం సహా ప్రధాన ఆలయాలకు వెళ్లే రహదారి మార్గాలను మెరుగుపరచేందుకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. పుష్కరాల నాటికి భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించే విధంగా రహదారి కనెక్టివిటీని బలోపేతం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా ఎంతో ప్రాధాన్యం కలిగినవని పేర్కొంటూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కమిటీ సూచించింది.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
