Let's talk: editor@tmv.in
గోదావరి పుష్కరాలు పది కోట్ల జనం వచ్చే అవకాశం

గోదావరి పుష్కరాలు పది కోట్ల జనం వచ్చే అవకాశం

Panthagani Anusha
25 జనవరి, 2026

ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే మహా నదీ సమాగమమైన గోదావరి పుష్కరాలు–2027కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మహా పుణ్యకార్యక్రమం 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్నారు.

గోదావరి నది ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డా. బి.ఆర్‌. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలు జరగనున్నాయి. కాగా సమీక్షకు ముందు ముఖ్యమంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తన హయాంలో మూడోసారి గోదావరి పుష్కరాలను నిర్వహించే అవకాశం రావడం తనకు ఎంతో అదృష్టం అని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాలు కుంభమేళాతో సరితూగే మహా నదీ సమాగమమని ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరో 139 ఘాట్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో మొత్తం 373 ఘాట్లు అందుబాటులోకి రానున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో నదీ తీరం వెంబడి 9,918 మీటర్ల పొడవున ఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

10 కోట్ల మంది భక్తుల రాక

గోదావరి పుష్కరాల సందర్భంగా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా సుమారు 10 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, వసతి, వైద్య సేవలు, అత్యవసర చర్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి

2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, జాతీయ రహదారితో అనుసంధానించే ఐకానిక్ రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్రంగా రాజమండ్రిని అభివృద్ధి చేయాలని సూచించారు. పోలవరం ఒక మెగా సాగునీటి ప్రాజెక్టు అని, ఇది విశాలమైన వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే కాకుండా లక్షలాది మందికి తాగునీటిని అందించే కీలక పథకం అని సీఎం పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, అదేవిదంగా చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోదావరి పుష్కరాలను భక్తుల సౌకర్యమే కేంద్రంగా రాష్ట్ర ప్రతిష్ఠను చాటేలా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

గోదావరి పుష్కరాలు పది కోట్ల జనం వచ్చే అవకాశం - Tholi Paluku