Let's talk: editor@tmv.in
గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి: సిఎస్

గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి: సిఎస్

Panthagani Anusha
21 డిసెంబర్, 2025

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, సజావుగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ఇది తొలి సమావేశమని గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటి నుంచే శాఖల వారీగా జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో మంత్రుల బృందం, కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీరపాండ్యన్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించిందని తెలిపారు.

జిల్లా స్థాయిలో ఆయా శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటినుంచే జిల్లాల వారీగా స్నాన ఘట్టం వద్ద ప్రజా సౌకర్యార్థం శాఖలవారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మైక్రో ప్లాన్లు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా స్నాన ఘట్టాల గుర్తింపు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య శిబిరాలు, భద్రత, జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలపై సవివరమైన డీపీఆర్‌లను రూపొందించి పంపాలని సూచించారు.

గత పుష్కరాలతో పోలిస్తే ప్రస్తుతం జనాభా పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, సాంకేతికత విస్తరించడం, ప్రజల్లో భక్తిభావాలు పెరగడం వంటి కారణాలతో 2027 గోదావరి పుష్కరాలకు రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని సీఎస్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రవేశించే గోదావరి నది ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల మీదుగా ప్రవహిస్తుందని, ఈ ఆరు జిల్లాల్లోని స్నాన ఘట్టాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. దేవాదాయ, నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, పురపాలక–పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, ట్రాన్స్‌కో, మత్స్య, అగ్నిమాపక, ఏపీఎస్‌ఆర్టీసీ, రైల్వే, పర్యాటక, సమాచార–పౌర సంబంధాలు, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

పుష్కరాల సమయంలో జనసమూహాల నిరంతర పర్యవేక్షణకు ఐటీ, ఆర్టీజీఎస్ ద్వారా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, ముఖ్యంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే తేదీలను ముందే అంచనా వేసి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లో జరిగిన గంగా మహా కుంభమేళా అనుభవాలు, గత గోదావరి పుష్కరాల అనుభవాలను అధ్యయనం చేసి రెట్టింపు స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రత్యేక అధికారి జి. వీరపాండ్యన్ మాట్లాడుతూ 2015 గోదావరి పుష్కరాలకు 4.86 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని రానున్న పుష్కరాలకు 9 నుంచి 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. 2015లో 1,927 బస్సులు 400 రైళ్లను ఏర్పాటు చేయగా, ఈసారి వాటికి మించి రెట్టింపు స్థాయిలో రవాణా సదుపాయాలు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్, జలవనరుల శాఖ సీఈ శేషుబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌గా ముఖ్య కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ, ఏడీజీ (లా అండ్ ఆర్డర్), ఐ అండ్ పీఆర్ డైరెక్టర్, ఏపిటిడిసి ఎండీ, ఇతర శాఖల కార్యదర్శులు, అధికారులు, ఆరు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.