Let's talk: editor@tmv.in
గోదావరి నీటి ప్రవాహం 70 ఏళ్ల కనిష్టానికి పతనం: మంత్రి రామానాయుడు

గోదావరి నీటి ప్రవాహం 70 ఏళ్ల కనిష్టానికి పతనం: మంత్రి రామానాయుడు

Gaddamidi Naveen
22 జులై, 2026

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, నీటిపారుదల రంగాన్ని అతలాకుతలం చేస్తున్న "సూపర్ ఎల్‌‌నినో" ప్రభావం వల్ల గోదావరి నది నీటి ప్రవాహం గడిచిన 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. రామానాయుడు మంగళవారం వెల్లడించారు. జులై నెలలో సాధారణంగా ఉండాల్సిన నీటి మట్టం తీవ్రంగా తగ్గిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నీటిపారుదల రంగానికి చెందిన నిపుణుల గణాంకాలను ప్రస్తావిస్తూ.. సాధారణంగా జులై నెలలో గోదావరి ప్రవాహం 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరకు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం అది కేవలం 15,000 నుంచి 20,000 క్యూసెక్కులకు పడిపోయిందని మంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో ప్రతి ఏటా దాదాపు 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా చేరుతుంటుందని, అయితే ఈ ఏడాది ఎల్‌‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత దారుణంగా తగ్గిపోయిందని వివరించారు.

నదిలో ప్రవాహం తగ్గడంతో గోదావరి డెల్టా ప్రాంతంలోని దాదాపు 10.17 లక్షల ఎకరాల సాగు భూములకు నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సీలేరు నుంచి నీటిని తరలిస్తోందని రామానాయుడు చెప్పారు. సాధారణంగా సీలేరు నీటిని కేవలం రబీ కాలంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే వాడుకుంటారని, అయితే ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది 49 శాతం వర్షపాత లోటు నమోదైంది.

డెల్టా ప్రాంతాల ఎదుర్కొంటున్న సవాళ్లు

తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం గోదావరి డెల్టా సాగుకు 14,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అయితే డెల్టాలోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాజెక్టుల నిర్మాణం 70 శాతం కాలువల ద్వారా 30శాతం వర్షపాతం ఆధారంగా నీరు అందేలా డిజైన్ చేయబడిందని, వర్షాలు లేకపోవడంతో రెండు డెల్టాలు పూర్తిగా కాలువల నీటిపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు.

చివరి ఆయకట్టుకు నీరు చేరేలా కాలువల మరమ్మతులు, పూడికతీత పనులను వేగవంతం చేస్తున్నాం. ఎత్తైన ప్రాంతాల్లోని 10 శాతం భూములకు నీరు చేరడం కష్టమైనప్పటికీ, మిగిలిన 90 శాతం పొలాలకు ఖరీఫ్ సాగు కోసం నీటిని ఖచ్చితంగా అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. కలెక్టర్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు.