Let's talk: editor@tmv.in
గోదావరి జలాలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ.. తెలంగాణ హక్కులను కాపాడుతాం: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ.. తెలంగాణ హక్కులను కాపాడుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
23 ఫిబ్రవరి, 2026

గోదావరి నదీ జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలు, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఒక పూర్తి రోజు సమగ్రంగా చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా జలాల్లో ఉన్న హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి సందేహాలకు లోనుకావాల్సిన అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జఠిలమైన సమస్యలు కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకోవచ్చని విశ్వసిస్తున్నామని చెప్పారు. మొదట అధికారులు, రెండు రాష్ట్రాల ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిపి ఫలితం రాకపోతే రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు, ట్రిబ్యునళ్లు లేదా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను సీఎం పరిశీలించి. అక్కడ ఇంజనీర్లతో మాట్లాడి ప్రాజెక్టు పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల ఇంటేక్ పాయింట్ వద్ద మోటార్ల పనితీరును మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిశీలించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

గోదావరి, కృష్ణా నదులలో నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలపై తెలంగాణ హక్కులను సమర్థంగా కాపాడుతామని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో గత పాలనల్లో జరిగిన నిర్లక్ష్యం వల్ల జలవనరులు సద్వినియోగం కాలేదని ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సుమారు 967 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురాగలిగేవారని ఆయ‌న చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారమున్నందున ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విడుదలలో కొంత పరిమితి ఉందని సీఎం వివరించారు. అయినప్పటికీ వచ్చే రెండేళ్లలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అవసరమైన నిధులను తక్షణమే సమీకరించి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తుమ్మడిహెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష ఎత్తిపోతల లేకుండానే రాష్ట్రంలో మంచి వ్యవసాయ దిగుబడులు సాధించామని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రజల ఆస్తులేనని సీఎం అన్నారు. వాటి భద్రతపై సమగ్ర అధ్యయనం చేసి, భవిష్యత్తులో ప్రమాదాలు తలెత్తకుండా పునరుద్ధరణ చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఇటీవల జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందని సీఎం ప్రశంసించారు. దక్షిణ కుంభమేళా తరహాలో జాతర నిర్వహణ జరిగిందని తెలిపారు. మేడారం ప్రాంతాన్ని భక్తులు నిరంతరం సందర్శించేలా అభివృద్ధి పనులు చేపడతామని, శాసనసభ బడ్జెట్ సమావేశాల తర్వాత మళ్లీ మేడారం వెళ్లి సమీక్ష నిర్వహిస్తానని సీఎం వెల్లడించారు.

దేవాదుల భూసేకరణకు రూ. 600 కోట్లు

దేవాదుల ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ.600 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల లోపు అన్ని అంచనాలను ప్రభుత్వం ముందుంచి ఆమోదం పొందాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. దేవాదుల పంప్ మరమ్మతు పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మార్చిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలను ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

శాసనసభ సమావేశాల సమయంలో దేవాదుల ఎత్తిపోతల పథకంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ హాలులో ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కోల్పోయిన వారికి గ్రీన్‌ ఛానెల్ విధానంలో పరిహారం నిధులు వెంటనే మంజూరు చేయాలని, భూసేకరణ జాప్యం కారణంగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతగా కొనసాగుతుందని చెప్పారు.

అదేవిధంగా రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీటిని అందించే ప్రణాళికపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతాల్లో నీటి వనరుల అనుసంధానం ద్వారా వ్యవసాయం, తాగునీటి అవసరాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని. ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారకూడదని, అవసరమైన నిధులను సమీకరించి పనులు వేగవంతం చేయాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

గోదావరి జలాలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ.. తెలంగాణ హక్కులను కాపాడుతాం: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku