Let's talk: editor@tmv.in
గోదావరి జలాలతో వికారాబాద్ సస్యశ్యామలం: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాలతో వికారాబాద్ సస్యశ్యామలం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
8 ఫిబ్రవరి, 2026

గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'ప్రజా పాలన - ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక హామీలను ఇచ్చారు.

మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మిదేవిపల్లి వద్ద నిర్మించనున్న రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులు పూర్తిచేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తాండూరు పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయడంతో పాటు కాగ్నా నుంచి మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. అలాగే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ మార్గంగా తాండూరు వరకు రోడ్డు నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి కీలకమైన త్రిబుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని, భవిష్యత్తులో వికారాబాద్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆయన కోరారు.

రైతాంగం, నిరుద్యోగ యువత, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ పలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాలోని 6,650 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రూ. 567.69 కోట్ల చెక్కును మహిళా ప్రతినిధులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఈ బహిరంగ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర్ రాజనర్సింహ, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.