
గొరంట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య
శ్రీ సత్యసాయి జిల్లా గొరంట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని వనవోలు గ్రామానికి చెందిన శ్యాంపురం మహేష్ (38) అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఫలితం లేకపోయింది.
పోలీసుల కథనం ప్రకారం మల్లెల గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ చిన్న వివాదంపై 'డయల్–100'కు ఫిర్యాదు అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన బ్లూకోల్ట్స్ పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని సద్దుమణిగించారు. అయితే ఈ విషయమై మాట్లాడేందుకు గొరంట్ల స్టేషన్‌కు వచ్చిన మహేష్ పోలీస్టేషన్ ఆవరణలో ఉండగానే తన వెంట తెచ్చుకున్న పురుగుమందును ఒక్కసారిగా తగదు వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గొరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హిందూపురానికి తరలించారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందాడు.
వ్యక్తిగత కారణాలే కారణం
ఈ ఘటనపై డీఎస్పీ నర్సింగప్ప మాట్లాడుతూ.. మహేష్ మృతికి వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిడిలే ప్రధాన కారణమని తెలిపారు. గతంలో ఆయన పనిచేసిన డైరీకి సంబంధించిన పీఎఫ్ నగదు రాకపోవడం, గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం మహేష్‌ను కుంగదీశాయని పేర్కొన్నారు. గతంలో కూడా మహేష్ పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
అయితే మహేష్‌ను పోలీసులు వేదించడంవల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నవార్త సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వస్తుండడంతో ఆ వార్తలు అవాస్తవమని మృతుడి సోదరుడు హరీష్ కొట్టిపారేశారు. తన అన్న మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల తప్పిదం ఏమీ లేదని ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిరాధారమైన వదంతులను నమ్మవద్దని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘటనపై గొరంట్ల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 05/2026గా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
