
గొప్ప దార్శనికుడు వాల్మీకి
వాల్మీకి మహర్షి గొప్ప రచయిత, ఆది కవి అని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొనియాడారు. పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదిమహల్ లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, హాజరయ్యారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ మహర్షి వాల్మీకి గొప్ప ఆదికవి అని కొనియాడారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాలను మతాలకు సముచిత స్థానం కల్పిస్తోందన్నారు.
7వేల సంవత్సరాల క్రితం వాల్మీకి రచించిన రామాయణ కావ్యం ఇప్పటికీ సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్న గ్రంథంగా నిలిచిందన్నారు. బోయ కుటుంబంలో జన్మించిన రత్నాకర్ తనజీవితమలో ఒక వేటగాడిగా, ఒక దొంగగా.. ఆ తర్వాత ఒక వాల్మీకి మహర్షిగా జీవితాన్ని మార్చుకున్నాడని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యంలో రామునికి హనుమంతుడు ఒక మంచి స్నేహితుడిగా విశ్వస్వనీయుడిగా ఎలా ఉండాలో తెలియజేశారు. అలాగే రాముడు లక్ష్మణుడు సోదరులుగా కలసి మెలసి జీవితాన్ని ఎలా కొనసాగించాలో ప్రతి సోదరులకు ఒక మార్గదర్శిగా నిలిచారు.
శ్రీరాముడు ఆయన సతీమణి సీత నిజ జీవితంలో భార్య ఎలా ఉండాలి భర్త ఏ విధంగా ఉండాలో ఈ రామాయణ కావ్యం ద్వారా ప్రపంచానికి చెప్పారన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తనకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అందుకు వాల్మీకి కుటుంబ సభ్యులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి బోయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేస్తానని తెలిపారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి యుగ పురుషుడని కొనియాడారు. రామాయణంలో శ్రీరామచంద్రుడి పాలన ఎలా సాగిందో వాల్మీకి మహర్షి రామాయణ కావ్యం ద్వారా సమాజానికి చక్కని సందేశాన్ని ఇచ్చారన్నారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి చరిత్రలో స్థిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే వాల్మీకులను ఎస్టీల్లోకి చేర్చాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు.
