
గేట్ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు శుభవార్త. అభ్యర్థుల సౌకర్యార్థం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి గేట్ 2026 దరఖాస్తు గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించింది. లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 9 వరకు గడువు ఇచ్చారు.
ఈ పరీక్షను ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా రాయవచ్చు. ఈ పరీక్షకు వయోపరిమితి లేదు. అర్హత కలిగిన ఎవరైనా ఈ పరీక్షకు హాజరుకావచ్చు.
గేట్ 2026కు దరఖాస్తు ఎలా చేయాలి?
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.inను సందర్శించండి. హోమ్ పేజీలో కనిపించే అప్లికేషన్ పోర్టల్ లింక్‌పై క్లిక్ చేయండి. మీ పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఇతర ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పొందండి. ఈ వివరాలతో లాగిన్ అవ్వండి. వ్యక్తిగత వివరాలు, విద్యా సంబంధిత వివరాలు, కమ్యూనికేషన్ అడ్రస్ వంటి వివరాలను నమోదు చేయండి. పరీక్ష పేపర్, పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోండి. అవసరమైన పత్రాలను (ఫొటోగ్రాఫ్, సంతకం, ఐడీ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికెట్) నిర్దేశిత ఫార్మాట్, సైజులో అప్‌లోడ్ చేయండి. మీ కేటగిరీకి వర్తించే దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి. మీరు నమోదు చేసిన వివరాలు, అప్‌లోడ్ చేసిన పత్రాలు, చెల్లించిన రుసుము వివరాలను ఒకసారి సరిచూసుకుని, దరఖాస్తును సమర్పించండి. భవిష్యత్ అవసరాల కోసం సమర్పించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
అవసరమైన పత్రాలు
దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు అభ్యర్థులు ఫొటోగ్రాఫ్, సంతకం, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్), ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్ (వర్తిస్తే), ఓబీసీ నాన్-క్రీమీ లేయర్/ ఈడబ్యూఎస్ /పీడబ్యూఎస్ సర్టిఫికెట్‌లను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పరీక్షలు ఎప్పుడంటే?
ఐఐటీ గౌహతి గేట్ 2026 పరీక్ష తేదీల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని ప్రకటించింది. మొదట ఈ పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే 8వ తేదీ రోజు యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉండటం వల్ల ఆ తేదీన జరగాల్సిన పేపర్‌ను ఫిబ్రవరి 6 లేదా 16కి మార్చే అవకాశం ఉంది. తుది టైమ్‌టేబుల్ త్వరలో అధికారికంగా విడుదల కానుంది. గేట్ పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక సెషన్, 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మరో సెషన్ జరుగుతుంది. ఫలితాలను మార్చి 19, 2026న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.inను సందర్శించండి.
