Let's talk: editor@tmv.in
గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ భాగస్వామ్యం…ప్రజా ఆరోగ్యానికి బలమైన పునాది: లంకా దినకర్

గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ భాగస్వామ్యం…ప్రజా ఆరోగ్యానికి బలమైన పునాది: లంకా దినకర్

Panthagani Anusha
18 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్రమైన, మెరుగైన ప్రజా ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ సేవా సంస్థ 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న భాగస్వామ్యం ఆరోగ్య రంగంలో నూతన శకానికి నాంది పలకనుందని ఏపీ 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'సంజీవిని' ప్రాజెక్ట్ కేంద్రంగా సాగుతున్న ఈ సహకారం రాష్ట్రంలోని 5.3 కోట్ల జనాభాకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే పరమావధిగా పెట్టుకుందని పేర్కొన్నారు.

కుప్పం పైలట్ సక్సెస్.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

చంద్రబాబు నాయుడు సంకల్పించిన ‘సంజీవిని’ ప్రాజెక్టును తొలుత కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలు చేసినట్లు దినకర్ వెల్లడించారు. అక్కడ సుమారు 2.9 లక్షల మందికి నిర్వహించిన ఆరోగ్య పరీక్షలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. కాగా కుప్పం ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 71 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని ముందస్తు పరీక్షల ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు.

డిజిటల్ వేదికతో పారదర్శక సేవలు

కరోనా సమయంలో రాష్ట్రం అభివృద్ధి చేసుకున్న డిజిటల్ మౌలిక సదుపాయాలే ఈ ప్రాజెక్టుకు బలమైన పునాదిగా నిలిచాయని ప్రజా ఆరోగ్య సూచీలను డిజిటల్ పద్ధతిలో నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వైద్య సేవల పంపిణీలో పారదర్శకత పెరిగిందని దినకర్ పేర్కొన్నారు.

కాగా ఈ భాగస్వామ్యం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ మధ్య ఉన్న దీర్ఘకాలిక అనుబంధానికి ఇది కొనసాగింపు అని దినకర్ గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు బిల్ గేట్స్‌ను హైదరాబాద్‌కు రప్పించి, మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఐటీ రంగంలో వచ్చిన ఆ విప్లవం లాగే ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆరోగ్య రంగంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హెల్తీ ఆంధ్రప్రదేశ్ - స్వర్ణాంధ్ర విజన్

రాష్ట్రాన్ని ‘హెల్తీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ‘స్వర్ణాంధ్ర–2047’ దార్శనికతలో భాగంగా ప్రతి పౌరుడికి ఆరోగ్యం, సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు దినకర్ స్పష్టం చేశారు. గేట్స్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల అనుభవాలను జోడించి ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం మందుల పంపిణీ ప్రజారోగ్య విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలవనుందని ఆయన పేర్కొన్నారు.