Let's talk: editor@tmv.in
గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్!

గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్!

T Venkata Ramana
5 అక్టోబర్, 2025

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అటు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఇటు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం సర్వేలు, అంతర్గత సమావేశాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సతీమణి మాగంటి సునీత పేరును ఇప్పటికే ప్రకటించి సానుభూతిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలుపు తప్పనిసరి అని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. బలమైన, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు.

సర్వేలు, షార్ట్‌లిస్ట్‌తో ముందుకు

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కోర్టు అంశాలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప ఎన్నికల ఇంచార్జులు వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకు మూడు రోజుల్లో రేసులో ఉన్న క్షేత్ర స్థాయిలో బలం ఉన్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే నివేదికతో పాటు, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ముందు అభ్యర్థి ఎంపికపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కూడా ప్రత్యేకంగా సర్వే చేస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రజాభిమానం, గెలుపు సామర్థ్యం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే వంటి ఆధునిక పద్ధతులను కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు, ఇతర అభివృద్ధి పనులను ప్రధాన ఎన్నికల అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాలపై ఫోకస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బలమైన వెలమ కోటాలో మాగంటి సునీతను బరిలోకి దించగా కాంగ్రెస్ పార్టీ బలమైన బీసీ వర్గానికి చెందిన నాయకుడిని లేక రెడ్డి కోటాలో ఒక అభ్యర్థిని పరిశీలిస్తోంది. బీసీ కోటాలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తో సమావేశమై టికెట్ ఆశిస్తున్నట్లు విన్నవించారు. నవీన్ యాదవ్ కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పేరుంది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. ఇక రెడ్డి వర్గంలో సీఎన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిల పేరు పరిశీలనలో ఉంది.

రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం

రాష్ట్ర నాయకత్వం సిఫార్సులు, ఏఐసీసీ సర్వే నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నెల 6 న జరిగే ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తుది అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు బీఆర్ఎస్‌కు దీటైన అభ్యర్థిని బరిలో దించడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ఎన్నికలో గెలవడం ద్వారా రాష్ట్రంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమను ప్రతిబింబించనుంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత రసవత్తరంగా మారనుంది.

గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్! - Tholi Paluku