Let's talk: editor@tmv.in
గూగుల్ రివ్యూల పేరుతో సైబర్ మోసాలు!

గూగుల్ రివ్యూల పేరుతో సైబర్ మోసాలు!

Gaddamidi Naveen
7 జనవరి, 2026

ఆన్‌లైన్‌లో సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపి నిరుద్యోగులను, సామాన్యులను దోచుకుంటున్న సైబర్ ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గూగుల్‌లో వెబ్‌సైట్లకు రివ్యూలు ఇవ్వడం ద్వారా లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వేలల్లో డబ్బులు సంపాదించవచ్చని వస్తున్న ప్రకటనలు, మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో సులభంగా ఆదాయం, ఇంట్లో నుంచే పని, రోజుకు కొన్ని నిమిషాల్లో భారీ లాభాలు వంటి ఆకర్షణీయమైన మాటలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింక్‌లను క్లిక్ చేయమని కోరుతూ, ముందుగా చిన్న మొత్తంలో డబ్బు సంపాదించారని నమ్మకం కలిగించి, ఆ తర్వాత భారీ మొత్తాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు.

గూగుల్ రివ్యూలు, యాప్ రేటింగ్‌లు, ఆన్‌లైన్ టాస్క్‌లు అంటూ అడిగే ఈ ఆఫర్లు చాలా వరకు మోసపూరితమైనవేనని పోలిసులు చెబుతున్నారు. ఒకసారి డబ్బు చెల్లించిన తర్వాత, ఆ అకౌంట్లు మూసివేయడం లేదా స్పందన లేకుండా పోవడం జరుగుతోంది. మీ ఆర్థిక అవసరాలు, ఉద్యోగ అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారికి అవకాశం ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండాలి. ఎలాంటి ఉద్యోగం అయినా సరైన సంస్థ వివరాలు, అధికారిక వెబ్‌సైట్, నమోదు వివరాలు పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మోసపోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

గూగుల్ రివ్యూల పేరుతో సైబర్ మోసాలు! - Tholi Paluku