
గులాబీ అతిథుల రాకతో పరవశించిన భారత తీరాలు
ప్రతి ఏడాది చలికాలం తలుపుతట్టగానే ఆకాశం కొత్త కలలతో నిండిపోతుంది. దూర దేశాల నుంచి వందల, వేల మైళ్ల దూరం ప్రయాణించి వచ్చే ఆ వలస పక్షులు, మన తీరాలు, సరస్సులు, చెరువులపై రెక్కలతో రంగులు పూస్తాయి. గాలిలో తేలే వాటి గానం మనకు చెబుతుంది. ప్రకృతి ఇంకా జీవంగా ఉందని… ఆకాశం ఇంకా మనదేనని. వీటి రాకతో చెరువులు మెలకువ అవుతాయి, గాలులు పల్లవిస్తాయి. మన హృదయాలు కూడా కొత్త ఊపిరి తీసుకుంటాయి. ఈ పక్షులు కేవలం ఆకాశ యాత్రికులు కావు. ఇవి ప్రకృతి సమతుల్యతకు జీవచిహ్నాలు. మనిషి, ప్రకృతి మధ్య బంధాన్ని మళ్లీ గుర్తు చేసే సందేశ దూతలు.అందుకే వలస పక్షుల రాక, ప్రకృతికి కొత్త ఊపిరి..
“పక్షి రెక్కలు గాలిలో కాదు, మనసులో ఎగురుతాయి
వాటి రాకతో మనలోని ప్రకృతి మేలుకుంటుంది.
తూత్తుకుడి తీరాన్ని గులాబీ రంగుతో నింపిన ఫ్లెమింగోలు
తమిళనాడులోని తూత్తుకుడి తీరప్రాంతం ఇటీవల రోజుల్లో మళ్లీ ప్రకృతి సౌందర్యంతో కళ్లకు విందుగా మారింది. తీరప్రాంతం ఉన్నట్టుండి గులాబీ సముద్రంలా మారిపోయింది. వేల సంఖ్యలో గ్రేటర్ ఫ్లెమింగోలు ఈ ప్రాంతానికి వలసగా చేరడంతో సముద్ర తీరమంతా గులాబీ రంగులో మెరిసిపోతోంది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు.
వేలాది ఫ్లెమింగోలు సముద్రతీరంలోని తడిబయళ్ళు, ఉప్పు చెరువుల్లో విరాజిల్లుతూ ప్రకృతి ప్రేమికుల కళ్లను మాయ చేస్తున్నారు. సూర్యోదయ కాంతిలో గులాబీ రంగులో మెరిసే ఈ దృశ్యం తీరప్రాంతాన్ని కళాత్మకంగా మలుస్తోంది. శీతాకాలం ప్రారంభంతో కలిపి, అక్టోబర్ నెలాఖరు నుండి వీటి రాక మొదలైంది. ఈ సహజ దృశ్యం ప్రతి సంవత్సరం సాధారణంగా అక్టోబర్ నెలాఖరు, నవంబర్ నుండి మొదలయ్యి మార్చి వరకు కొనసాగుతుంది. ఈ పక్షులు భారత తీర ప్రాంతాలకు, ముఖ్యంగా అక్కడి ఉప్పు మడులు ఉప్పునీటి సరస్సులు, లోతట్టు చిత్తడి నేలల వద్ద గుంపులు గుంపులుగా చేరుకుంటాయి.
తూత్తుకుడి తీరానికి ఆనుకుని ఉన్న ఉప్పు చెరువులు, బ్రాకిష్ నీటి తడిబయళ్ళు ఈ ఫ్లెమింగోల వలసకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఆహారానికి అనుకూలమైన శైవలాలు, చిన్న కంకాళజీవులు సమృద్ధిగా ఉండటంతో ఈ ప్రాంతం వీటి ఇష్టమైన నివాసంగా మారింది. పక్షులు నీటిలో తమ పొడవైన కాళ్లతో నడుస్తూ, పొడవైన మెడలతో తల వంచి ఆహారం తీసుకుంటూ కనిపించడం తీరప్రాంత ప్రజలకు ఒక మంత్రముగ్ధకర అనుభూతిని ఇస్తోంది. పొడవైన కాళ్లు, వంకర ముక్కులు అందమైన గులాబీ రంగు ఈకలకు ప్రసిద్ధి చెందిన ఈ ఫ్లెమింగోలు తీర ప్రాంతాన్ని "గులాబీ వండర్లాండ్"గా మారుస్తాయి. ఇది పక్షుల వీక్షకులకు, పర్యాటకులకు ఎంతగానో ఎదురుచూసే ఒక అద్భుతమైన సంఘటన.
ప్రకృతి ప్రేమికులకు పండుగ వాతావరణం
తీర ప్రాంతం గులాబీ రంగుతో మెరిసిపోవడంతో పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు ఈ ప్రాంతానికి వెల్లువలా వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అందాల చిత్రాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. “తూత్తుకుడి తీరానికి ఇది ఒక ప్రకృతి వరం” అని స్థానికులు చెబుతున్నారు.
తూత్తుకుడి ఎందుకు ఆదర్శవంతమైన నివాసం
తూత్తుకుడి తీర వాతావరణం ఈ వలస పక్షులకు కీలకమైన స్టాప్‌ఓవర్ ఆహార క్షేత్రంగా ఉంటుంది
• సమృద్ధిగా ఆహారం: అక్కడి సహజ సిద్ధమైన ఉప్పు మడులు, నిస్సారమైన ఉప్పునీటి సరస్సులు పాచి సూక్ష్మ జీవులతో సమృద్ధిగా ఉంటాయి. ఇవే ఫ్లెమింగోల ప్రధాన ఆహారం.
• అనుకూలమైన వాతావరణం: వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతం స్థిరమైన వాతావరణం, పాచి సమృద్ధిగా ఉన్న నీరు మరియు ప్రశాంతమైన తీర పరిసరాలను అందిస్తుంది. ఇవి పక్షులు ఆహారం తీసుకోవడానికి, సంతానోత్పత్తికి సరైన పరిస్థితులను కల్పిస్తాయి.
పర్యావరణ, సామాజిక ప్రాముఖ్యత: ఫ్లెమింగోల రాక కేవలం అందమైన దృశ్యం మాత్రమే కాదు. ఇది ముఖ్యమైన పర్యావరణ విలువను కలిగి ఉంది. ఫ్లెమింగో రాక అంటే తూత్తుకుడి తీర పర్యావరణం ఇంకా జీవంతో నిండిందనే సానుకూల సంకేతం. ఇది స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ఒక శుభ పరిణామంగా పరిగణించవచ్చు.
• ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు సంకేతం: వలస పక్షులు క్రమం తప్పకుండా రావడాన్ని పర్యావరణవేత్తలు తూత్తుకుడి పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనడానికి బలమైన సాక్ష్యంగా, పర్యావరణ సమతుల్యతకు స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు.
• పర్యాటకానికి ప్రోత్సాహం: ఈ వార్షిక సంఘటన ఒక ప్రధాన ఆకర్షణగా మారింది, ఇది శీతాకాల నెలల్లో స్థానిక పర్యాటక రంగానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
• సంరక్షణ కృషి: పొరుగున ఉన్న తిరునల్వేలి జిల్లాలోని (కూంథన్‌కుళం ప్రాంతం) గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో వలస వచ్చిన పక్షులను రక్షించడానికి దీపావళి, పెళ్లి వేడుకల సందర్బాలలో పటాకులు కాల్చవద్దని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం
ఇక్కడ కనిపించే జాతులు: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తూత్తుకుడి తీరంలో గ్రేటర్ ఫ్లెమింగో జాతి పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. వాటితో పాటు కొన్నిపెయింటెడ్ స్టోర్క్ లు కూడా చేరాయని పరిశీలకులు తెలిపారు. అధికార లెక్కలు ఇంకా ప్రకటించకపోయినా, పక్షుల సంఖ్య వందల నుండి వేల వరకు ఉందని అంచనా.
తూత్తుకుడిలో ఫ్లెమింగోలు కనిపించే ముఖ్య ప్రదేశాలు
వలస వచ్చిన ఫ్లెమింగోలు (ఎక్కువగా గ్రేటర్ ఫ్లెమింగోలు) తూత్తుకుడి జిల్లాలోని అనేక తీర మరియు చిత్తడి ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి ఉప్పు మడులు, నిస్సారమైన ఉప్పునీటి చెరువులు, మరియు బురద నేలలు వంటి ఆహారం దొరికే ప్రదేశాలలో ఉంటాయి.
ఉప్పు మడులు: ఫ్లెమింగోలు ఎక్కువగా కనిపించే ముఖ్య ప్రదేశాలు ఇవే. ప్రత్యేకంగా సౌత్ బీచ్ రోడ్ మరియు హార్బర్ రోడ్ మధ్య ఉన్న విస్తారమైన ఉప్పు మడుల ప్రాంతంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. రోచ్ పార్క్ సమీపంలోని ఉప్పు మడులు కూడా వందలాది పక్షులను ఆకర్షిస్తాయి.
పళయకాయల్: ఇది సుప్రసిద్ధమైన తీర చిత్తడి నేల మరియు నదీ ముఖ ప్రాంతం. ఇక్కడ ఫ్లెమింగోలు విశ్రాంతి తీసుకుని ఆహారం తీసుకుంటాయి.
పున్నైకాయల్: పళయకాయల్‌కు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం కూడా వలస పక్షులకు ముఖ్యమైన చిత్తడి నేల. తూత్తుకుడి తీరం వెంబడి ఉన్న వెంబర్, వెప్పలోడై , కులత్తూర్ , మరియు పనైయూర్ ప్రాంతాలలో కూడా ఉప్పునీటి మడుగులు, నదీ ముఖ ద్వారాలు ఉంటాయి. ఇవి పక్షులకు అనుకూలంగా ఉండటం వలన ఇక్కడ కూడా వాటిని చూడవచ్చు.
పక్షులను చూసేందుకు ఉత్తమ సమయం: ఫ్లెమింగోలను చూసేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నెలాఖరు, నవంబర్ నుండి మార్చి వరకు. ఉదయం వేళల్లో, లేదా సాయంత్రం (సూర్యాస్తమయం సమయంలో) పక్షులు చురుకుగా ఆహారం తీసుకునేటప్పుడు చూడటం మరింత అద్భుతంగా ఉంటుంది.
పులికాట్ సరస్సు - గులాబీ అతిథుల గృహం
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉన్న పులికాట్ సరస్సు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇక్కడికి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి వరకు వేలాది ఫ్లామింగోలు, పెలికాన్లు, హెరాన్‌లు, స్టోర్కులు వలస వస్తాయి.
ఫ్లెమింగోలు ముఖ్యంగా సరస్సు తూర్పు తీరంలోని శ్రీశైలం, దొప్పలపూడి, తజంగీ, శేషవరం ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి ఉప్పు నీటిలో ఉండే ఆల్గీ, సూక్ష్మజీవులు వీటికి ప్రధాన ఆహారం. పులికాట్ సరస్సు చుట్టుపక్కల ఉన్న మంగ్రోవ్ అడవులు , ఉప్పు చెరువులు వీటికి సురక్షిత వాతావరణం అందిస్తాయి. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించే “ఫ్లామింగో ఫెస్టివల్” ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. స్థానిక ప్రజలు, పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఈ సందర్భంలో వేలాదిగా చేరి ఈ గులాబీ అతిథులను ఆస్వాదిస్తారు.
చిలికా సరస్సు - పక్షుల స్వర్గధామం
ఒడిశా రాష్ట్రంలోని చిలికా సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది బంగాళాఖాతం తీరంలో, పూరీ సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు, చిలికా సరస్సు పక్షుల రాజ్యంగా మారిపోతుంది. అక్కడికి సైబీరియా, కజకిస్తాన్, ఇరాన్, ఆఫ్రికా వంటి దేశాల నుంచి వందల రకాల వలస పక్షులు వస్తాయి. వాటిలో ప్రధానమైనవి ఫ్లెమింగోలు, గీసులు, డక్స్, హెరాన్‌లు. చిలికాలోని మహానదీ డెల్టా ప్రాంతం, కలిజాయి దీవి, నలబనా పక్షి అభయారణ్యం. ఇవి ఫ్లెమింగోల ప్రధాన విశ్రాంతి కేంద్రాలు.
ఫ్లెమింగోలు ఇక్కడ ఎక్కువగా స్వల్ప ఉప్పుతనమున్న నీటిలో, ఆహారం సమృద్ధిగా లభించే ప్రాంతాల్లో గుంపులుగా విహరిస్తాయి. వేలల్లో వీటిని ఒకేసారి గమనించడం అక్కడి ప్రకృతి దృశ్యాన్ని గులాబీ కాంతులతో మెరిసేలా చేస్తుంది.
పర్యావరణ ప్రాముఖ్యత: పులికాట్, చిలికా సరస్సులు రెండూ రామ్‌సార్ సైట్స్ అంటే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తడి భూములు. ఈ సరస్సులు కేవలం పక్షులకే కాదు, మన పర్యావరణానికి కూడా శ్వాసనిచ్చే సహజ వ్యవస్థలు.ఫ్లెమింగోల రాక అంటే అక్కడి నీటి నాణ్యత, జీవావరణం ఆరోగ్యంగా ఉన్నట్టు సూచన. అందుకే, ఈ ప్రాంతాల్లో పర్యాటక నియంత్రణ, మలిన నివారణ, స్థానిక ప్రజల అవగాహన చాలా ముఖ్యం. పులికాట్ సరస్సు, చిలికా సరస్సులు ఇవి ప్రకృతి ఇచ్చిన రెండు అపురూపమైన పక్షి స్వర్గధామాలు. వీటిలో గులాబీ అతిథుల రాక అంటే ప్రకృతి మెలుకువలు మోగుతున్న సంకేతం.
“గులాబీ అతిథులు రాకపోతే, తడి భూములు వాడిపోతాయి
ప్రకృతి మళ్లీ శ్వాస తీసుకోవాలంటే వాటిని కాపాడాలి.”
ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఈ దృశ్యాన్ని పర్యాటక అభివృద్ధితోపాటు, పక్షి సంరక్షణకు అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. తడిబయళ్ళ పునరుద్ధరణ, నీటి నాణ్యత పరిరక్షణ, పర్యాటక నియంత్రణ ఇవన్నీ కలిపి తూత్తుకుడి తీరాన్ని, పులికాట్ సరస్సుని,చిలక సరస్సుని దీర్ఘకాలంగా ఫ్లెమింగోలు స్వర్గధామంగా నిలబెట్టవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ గులాబీ తీరాలు ప్రకృతి అందం, పర్యావరణ సందేశం రెండింటినీ కలిపిన అరుదైన అద్భుతం. మరి ఇంతలా చెప్పుకుంటున్న ఈ ఫ్లెమింగో పక్షులు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా ..
ఫ్లెమింగోలు అంటే
పొడవైన మెడలు, సన్నని కాళ్లు, వంగిన ముక్కు, గులాబీ రంగు శరీరంతో ఉన్న ఈ పక్షులు సహజసిద్ధమైన అందానికి ప్రతీకలు. ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల ఫ్లెమింగోలు ఉన్నా, భారతదేశంలో ప్రధానంగా రెండు రకాలే ఎక్కువగా కనిపిస్తాయి. గ్రేటర్ ఫ్లెమింగో మరియు లెస్సర్ ఫ్లెమింగో.
ఇవి ఎక్కడినుంచి వస్తాయి?
ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ గులాబీ అతిథులు భారత తీరాలకు చేరుకుంటాయి. ఇవి ప్రధానంగా ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాల నుంచి వలస వస్తాయి. అక్కడి చలికాలం తీవ్రంగా ఉండటంతో ఆ ప్రాంతాల్లోని నీటి వనరులు ఎండిపోతాయి. వేడి వాతావరణం, ఉప్పు చెరువులు, తడిబయళ్ళు ఉన్న భారత తీరప్రాంతాలు వీటికి అద్భుతమైన ఆశ్రయాలుగా మారతాయి.
భారతదేశంలో వీటి ప్రధాన ఆవాసస్థలాలు
ఫ్లెమింగోలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కనిపిస్తాయి. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్, నల్ సరోవర్ ప్రాంతాలు వీటి ప్రధాన గూళ్ల స్థలాలు. మహారాష్ట్రలోని థానే క్రీక్, నవి ముంబై ప్రాంతాలు “ఫ్లామింగో ఫెస్టివల్” నిర్వహణతో ప్రసిద్ధి చెందాయి. తమిళనాడులో తూత్తుకుడి, పులికాట్ సరస్సు ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు వలస వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సు, ఒడిశాలోని చిలికా సరస్సు, రాజస్థాన్‌లోని సాంబర్ సరస్సు ఇవన్నీ ఫ్లెమింగోల గులాబీ గుంపులతో ప్రకృతిని అలరించే ప్రాంతాలుగా నిలుస్తాయి.
ఎందుకు వలస వస్తాయి?
• ఫ్లెమింగోలు వలస వచ్చే ప్రధాన కారణం ఆహారం, వాతావరణం, సంతానోత్పత్తి అవసరాలు.
• ఉప్పు చెరువులు, తడిబయళ్ళలో ఉండే ఆల్గీ, సూక్ష్మజీవులు వీటి ఆహార వనరులు.
• చలికాలంలో తమ నివాస ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోతాయి కాబట్టి వేడి వాతావరణం ఉన్న ప్రాంతాలకు వలస వస్తాయి.
• కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌లో ఇవి గూళ్లు కట్టి పిల్లలను పెంచుతాయి.
సంరక్షణ ప్రాంతాలు
భారతదేశంలో ఫ్లెమింగోల సంరక్షణ కోసం అనేక పక్షి అభయారణ్యాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని థానే క్రీక్ ఫ్లెమింగో సాంక్చ్యువరీ, గుజరాత్‌లోని నల్ సరోవర్ బర్డ్ సాంక్చ్యువరీ, ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులోని పులికాట్ బర్డ్ సాంక్చ్యువరీ, ఒడిశాలోని చిలికా సరస్సు ఇవన్నీ ఫ్లెమింగోల ఆహార వనరులను, గూళ్లను, సహజ వాతావరణాన్ని రక్షిస్తున్నాయి.
మీకు తెలుసా?
ఫ్లెమింగోల సమూహాన్ని “ఫ్లాంబోయన్స్” అంటారు అంటే రంగుల హర్షం. వీటి గులాబీ రంగు వీటి ఆహారంలో ఉన్న క్యారొటినాయిడ్ పిగ్మెంట్ల వల్ల వస్తుంది. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్ ఆసియా ఖండంలో ఫ్లామింగోలు గూళ్లు కట్టే ఏకైక ప్రదేశం.
ప్రకృతి అందాల గులాబీ కానుక
తడిబయళ్ళలో, చెరువులలో గులాబీ వెలుగుతో మెరిసే ఫ్లెమింగోలు ప్రకృతి మనకిచ్చిన అపూర్వమైన అందం. వీటి రాక పర్యావరణ సమతుల్యతకు సూచిక. ఈ పక్షులు మన తీరాలకు వస్తూ ఉండాలంటే తడిబయళ్ళను, చెరువులను, ఉప్పు చెరువులను కాపాడటం మన బాధ్యత.
సంరక్షణ అవసరం , ప్రభుత్వ దృష్టి అవసరం
పక్షుల రాక సంతోషకరమైనదే కానీ, దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ చర్యలు కూడా అవసరం. తీర ప్రాంత పరిశ్రమలు, ఉప్పు చెరువుల విస్తరణ, నీటి కాలుష్యం వంటి అంశాలు ఈ పక్షుల నివాసాలకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తడిబయళ్ళలో ప్రత్యేక ‘సైలెంట్ జోన్‌లు’ ఏర్పాటు చేసి, పర్యాటకులను నియంత్రించే చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరి మీకు దగ్గరగా ఏ ప్రాంతం వుందో తెలుసుకుని వెంటనే ఒక సారి ఆ గులాబీ వలస పక్షుల అందాలు చూసి రండి. ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరండి. అలాగే మరి మీవంతు భాద్యతగా ప్రకృతిని కాపాడుతామని వలస పక్షులకు భాద్యతా యుతమైన భరోసా ఇవ్వండి..
