
గురు తేజ్ బహదూర్ సింగ్ త్యాగం దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్
మానవత్వం, ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సింగ్ త్యాగం చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన గురు తేజ్ బహదూర్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో (షాహిదీ సమాగమం) ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి పవన్ కళ్యాణ్ సిక్కుల పవిత్ర పీఠం 'తఖ్త్ సచ్ కండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మధ్యాహ్నం సమయంలో సచ్ కండ్ గురుద్వారాకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గురుద్వారా బోర్డు ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్‌కు పవిత్రమైన తలపాగా ధరింపజేశారు. అనంతరం ప్రధాన మందిరంలోకి ప్రవేశించిన ఆయన పదవ గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సమాధిని దర్శించుకున్నారు. అక్కడ పవిత్ర చాదర్‌ను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుద్వారా గ్రంథీలు ఇద్దరు నేతలకు ఆశీర్వచనాలు అందించి, పవిత్ర వస్త్రాలను బహూకరించారు. మందిర ప్రదక్షిణ అనంతరం ప్రాంగణంలోని 'నిషాన్ సాహిబ్' ధ్వజానికి ఆయన ప్రణామం చేశారు.
భక్తుల సౌకర్యార్థం గురుద్వారాలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుద్వారా కమిటీ వారు పవన్ కళ్యాణ్‌ను శాలువాతో సత్కరించి సిక్కుల పవిత్ర ఆయుధమైన 'కిర్పాన్'ను, గురుద్వారా జ్ఞాపికను బహూకరించారు.
మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎంకు నాందేడ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ సీఎం, ఎంపీ అశోక్ చవాన్, ఎమ్మెల్యే జయ చవాన్, జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ. "గురు తేజ్ బహదూర్ సింగ్ గారి త్యాగం కేవలం ఆ కాలానికే కాదు రాబోయే తరాలకు నిరంతర స్ఫూర్తి. ధర్మం కోసం ఆయన చేసిన బలిదానం దేశ చరిత్రలో అజరామరం. అటువంటి మహనీయుడి 350వ ఆత్మార్పణ వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.
గురు తేజ్ బహదూర్ సింగ్ ఆత్మార్పణ కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు సమస్త మానవాళి ధర్మ స్వేచ్ఛ కోసం చేసిన మహా యజ్ఞమని ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. కాగా 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో కాశ్మీరీ పండితులపై జరుగుతున్న బలవంతపు మత మార్పిడులు, అరాచకాలను అడ్డుకోవడానికి ఆయన నడుం బిగించారు.
మతం మారకపోతే మరణం తప్పదు అని హెచ్చరించినప్పటికీ పరుల విశ్వాసాలను, మానవ హక్కులను కాపాడటం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేసేందుకే మొగ్గు చూపారు. 1675లో ఢిల్లీలోని చాంద్నీ చౌక్‌లో ఆయనను శిరచ్ఛేదం చేసినప్పటికీ, ధర్మం పట్ల ఆయన చూపిన అచంచల విశ్వాసం నేటికీ భారతీయుల గుండెల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. తన సొంత మతం కోసమే కాకుండా ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన రీతిలో దైవాన్ని ప్రార్థించే స్వేచ్ఛ ఉండాలని ఆయన చేసిన ఈ ఆత్మార్పణం భారత చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది.
