Let's talk: editor@tmv.in
గురు చరణ యాత్రలో ‘జోరే సాహిబ్’ దర్శించుకోండి:ప్రధాని మోదీ

గురు చరణ యాత్రలో ‘జోరే సాహిబ్’ దర్శించుకోండి:ప్రధాని మోదీ

Pinjari Chand
23 అక్టోబర్, 2025

గురు చరణ యాత్ర సందర్భంగా పవిత్రమైన ‘జోరే సాహిబ్’ దర్శించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రజలను కోరారు. ఈ యాత్ర ఢిల్లీలోని గురుద్వారా మోతి బాగ్ సాహిబ్ నుంచి బీహార్ రాష్ట్రంలోని గురుద్వారా పాట్నా సాహిబ్ వరకు కొనసాగనుంది. ఈ యాత్ర అక్టోబర్ 23నుంచి నవంబర్ 1వరకు సాగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ ‌లో పోస్ట్ చేశారు.

శ్రీ గురు గోబింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీ ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో మన సంబంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ యాత్ర వెళ్లే ప్రాంతాల్లోని ప్రజలు పవిత్ర ‘జోరే సాహిబ్’(చెప్పులు) దర్శించుకోవాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.

ఈ జోరే సాహిబ్ శ్రీ గురు గోబింద్ సింగ్ జీ ఆయన సహచరి మాతా సాహిబ్ కౌర్ జీ వారికి చెందిన అరుదైన పవిత్ర అవశేషాలు. వీటిని యూనియన్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుటుంబం 300 సంవత్సరాలుగా సంరక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు వీటిని చరణ సుహావా – గురు చరణ యాత్ర లో భాగంగా ప్రజల దర్శనార్థం దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. హర్దీప్ సింగ్ పూరి కుటుంబం ఢిల్లీలో తమ నివాసంలో అర్దాస్(ప్రార్థన) చేసి, పవిత్ర జోరే సాహిబ్‌ను పంథ్‌కు ప్రతీకాత్మకంగా అప్పగించారు. ఈ యాత్రలో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ పంచ్ ప్యారే (ఐదుగురు శిష్యులు) కూడా పాల్గొని సాంప్రదాయ సిక్కు విధానాలకు అనుగుణంగా ప్రదర్శన కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా గురుద్వారాల్లో కీర్తన్, లంగర్ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సిక్కు సమాజానికి ఇది ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత కలిగిన సందర్భంగా పరిగణిస్తారు.

గురు చరణ యాత్రలో ‘జోరే సాహిబ్’ దర్శించుకోండి:ప్రధాని మోదీ - Tholi Paluku